Published : 14 Feb 2022 01:17 IST

Hijab row: కర్ణాటకలో తెరుచుకోనున్న పాఠశాలలు.. ఉడిపిలో 144 సెక్షన్ విధింపు!

బెంగళూరు: హిజాబ్ వివాదం కారణంగా కర్ణాటకలో మూతబడిన పాఠశాలలు ఫిబ్రవరి 14న తిరిగి తెరుచుకోనున్నాయి. కళాశాలలు, యూనివర్సిటీల రీఓపెనింగ్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలోని అన్ని ఉన్నత పాఠశాలల వద్ద 144 సెక్షన్​ విధించనున్నట్లు ఆ జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.

స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితిని కొద్దిరోజులపాటు పరిశీలించిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలను తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘పదో తరగతి వరకు బడులు సోమవారం తెరుచుకుంటాయి. శాంతియుత వాతావరణం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలను ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పాఠశాలలు ప్రశాంతంగా నడుస్తాయనే నమ్మకంతో ఉన్నా’ అని సీఎం అన్నారు. హిజాబ్​ వివాదంలో విదేశీ శక్తుల పాత్రపై మీడియాలో వస్తున్న కథనాలను తమ దర్యాప్తు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారని బొమ్మై వెల్లడించారు.

హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం ఫిబ్రవరి 9న మూడు రోజుల సెలవులు ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14 నుంచి పదో తరగతి వరకు పాఠశాలలను తెరవాలని ఫిబ్రవరి 10న నిర్ణయించింది. ఈ వివాదంపై విచారణలో భాగంగా.. పాఠశాలలు, కళాశాలలను తెరవాలని కర్ణాటక హైకోర్టు మధ్యంతర తీర్పులో పేర్కొంది. తరగతి గదుల్లో విద్యార్థులు శాలువాలు, హిజాబ్​లు, స్కార్ఫ్​లు, మతపరమైన జెండాలు వంటివి ధరించకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని