Delhi water crisis: దిల్లీలో నీటి సంక్షోభం వేళ.. సుప్రీంకోర్టులో హిమాచల్‌ యూటర్న్‌

Delhi water crisis: సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ నీటి సంక్షోభం అంశం పలు మలుపులు తీసుకుంటుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌ చేసిన వాదనపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 

Published : 13 Jun 2024 16:22 IST

దిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభం(Delhi water crisis)పై సుప్రీంకోర్టు (Supreme Court)లో జరుగుతోన్న విచారణలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh) వినిపించిన వాదన ఆశ్చర్యపర్చింది. దిల్లీకి నీరు విడుదల చేశామని ఇటీవల చెప్పిన రాష్ట్రం.. తమవద్ద మిగులు జలాలే లేవని తాజాగా కోర్టులో పేర్కొంది.

దిల్లీవాసులు కొద్దిరోజులుగా హీట్‌వేవ్‌, నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతున్నారు. దీనికి పరిష్కారంగా 137 క్యూసెక్కుల అదనపు జలాలను హిమాచల్ ప్రదేశ్‌ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నీటి ప్రవాహం దిల్లీకి సరఫరా అయ్యేలా సహకరించమని హరియాణాకు సూచించింది. ఈనేపథ్యంలో నిన్న హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మీడియాతో మాట్లాడుతూ... ‘‘మేం ఇప్పటికే నీటిని విడుదల చేశాం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించాలని మా న్యాయవాదులకు సూచించాం’’ అని చెప్పారు.

కానీ ఈ రోజు కోర్టులో ఆ రాష్ట్ర తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘‘ మా దగ్గర అసలు మిగులుజలాలే లేవు. ఇంతకుముందు ఈ విషయాన్ని మేం సరిగా చెప్పలేకపోయాం. ప్రవాహానికి ఆటంకం కలిగిందని గతంలో చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నాం’’ అని వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకునే వీలుందంటూ కోర్టు తీవ్రంగా స్పందించింది. దాంతో ఆ న్యాయవాది కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ నీటి సంక్షోభానికి ఒక ముగింపు పలికేలా పరిష్కారం చూపాలని అప్పర్ రివర్ యమునా బోర్డుకు సూచించింది.

హరియాణా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హీట్‌వేవ్‌ కారణంగా కొద్దికాలంగా రాష్ట్రంలో నీటి డిమాండ్ గణనీయంగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే సుప్రీంలో విచారణ జరుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు