Assam: రాత్రివేళ జాతీయ పార్కులో సఫారీ.. సద్గురు, ముఖ్యమంత్రిపై విమర్శలు..!

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీవాసుదేవ్ జాతీయ పార్కు సందర్శన వివాదాస్పదమైంది

Updated : 26 Sep 2022 15:53 IST

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీవాసుదేవ్ జాతీయ పార్కు సందర్శన వివాదాస్పదమైంది. రాత్రివేళ సఫారీకి వెళ్లడం.. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ఉల్లంఘనేనంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. 

హిమంత బిశ్వ శర్మ, సద్గురు, పర్యాటక మంత్రి జయంత మల్లా బారువా.. శనివారం షెడ్యూల్ సమయం తర్వాత కజిరంగా జాతీయ పార్కులో పర్యటించారంటూ ఇద్దరు ఉద్యమకారులు ఫిర్యాదు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం.. మూగజీవాల అలవాట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షెడ్యూల్ సమయం తర్వాత అక్కడ సఫారీ చేయడం నిషేధం. ‘చట్టం ముందు అందరూ సమానులే. ఈ చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు. అలాంటి చర్యలను మేం సహించం. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వారిని అరెస్టు చేయాలి’ అని ఉద్యమకారుడు సోనేశ్వర్ నరా ఆరోపించారు. ఈ సందర్శన సమయంలో సద్గురు ఎస్‌యూవీని నడపగా, ఆ వాహనంలో హిమంత, బారువా వెంటే ఉన్నారు.   

ఈ ఆరోపణలను అస్సాం ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ‘ఇక్కడ ఉల్లంఘన అంటూ ఏమీ లేదు. చట్టం ప్రకారమే.. రక్షిత ప్రాంతంలో పర్యటించేందుకు మాకు వార్డెన్ అనుమతి ఇచ్చారు. ప్రజలు రాత్రిపూట వెళ్లకుండా ఏ చట్టమూ ఆపలేదు’ అని వ్యాఖ్యానించారు.  

ఈ వ్యవహారంపై అటవీ సంరక్షణ విభాగం ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘సద్గురు, ముఖ్యమంత్రి రాత్రివేళ సఫారీని ఆస్వాదించారని ఆరోపించడం సరికాదు. అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో.. చీకటి పడిందని చెప్పి వారి పర్యటనను రద్దు చేసే మార్గం లేదు’ అని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో తాము ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని