Manish Sisodia: దిల్లీ ఉప ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై పరువునష్టం కేసు నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కామ్‌రూప్‌లోని సీజేఎం కోర్టులో ఈ దావా వేశారు.

Published : 01 Jul 2022 21:11 IST

దిల్లీ: దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాపై పరువునష్టం కేసు నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కామ్‌రూప్‌లోని సీజేఎం కోర్టులో ఈ దావా వేశారు. హిమంత ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన భార్య రినికి భుయాన్‌కు పీపీఈ కిట్ల కాంట్రాక్టులు కేటాయించి కుంభకోణానికి పాల్పడ్డారని సిసోడియా ఇటీవల ఆరోపణలు చేశారు. వీటిని ఖండిస్తూ.. ఇప్పటికే రినికి గువాహటి సివిల్ జడ్జ్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

దేశంలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో మార్కెట్‌ రేటు కంటే అధిక ధరలకు పీపీఈ కిట్లను సరఫరా చేసేందుకు అస్సాం ప్రభుత్వం రినికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని మనీష్ సిసోడియా ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆరోపణలు చేశారు. ఒక్కో కిట్‌కు రూ.600 చొప్పున కొనుగోలు చేయాల్సింది పోయి.. హిమంత తన భార్య, కుమారుడికి చెందిన కంపెనీలకు అత్యవసర ఆర్డర్‌ ఇచ్చి ఒక్కొక్కటి రూ.990 ఖర్చు చేసి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకే దాతృత్వం పేరుతో 1500 పీపీఈ కిట్లను పంపిణీ చేశారని సిసోడియా విమర్శించారు. కొన్ని వార్తా సంస్థలు ప్రచురించిన పరిశోధనాత్మక కథనాలను ఉటంకిస్తూ.. ఈ విమర్శలు చేశారు. అప్పుడు వాటిపై స్పందించిన హిమంత.. త్వరలో గువాహటిలో కలుసుకుందామంటూ వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని