Himanta Biswa Sarma: ప్రధాని అమిత్‌ షా అట.. సాక్షాత్తు ముఖ్యమంత్రే పొరబడ్డారు..!

ప్రధాని అమిత్‌ షా, హోం మంత్రి నరేంద్రమోదీ.. ఇలా దేశంలో అత్యుత్తన్నత స్థాయి వ్యక్తుల పదవుల్ని తప్పుగా ప్రస్తావించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.

Published : 12 May 2022 01:32 IST

తదుపరి ప్రధానిని నిర్ణయించారా..?: కాంగ్రెస్

గువహటి: ప్రధాని అమిత్‌ షా, హోం మంత్రి నరేంద్రమోదీ.. ఇలా దేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల పదవుల్ని తప్పుగా ప్రస్తావించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనిలా పొరబడ్డారు. ఆయన మాటలిప్పుడు వైరల్‌గా మారగా.. దానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ ట్విటర్‌లో షేర్ చేసి, చురకలు అంటిస్తోంది.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రధాని అమిత్‌ షా, హోం మంత్రి నరేంద్రమోదీ అంటూ హిమంత బిశ్వ ప్రస్తావించారు. అధికార పార్టీ కొత్త ప్రధానిని ఎంచుకుందా ఏంటి..? అంటూ కాంగ్రెస్ తన విమర్శలకు పదునుపెట్టింది. అలాగే గతంలో జరిగిన ఈ తరహా సంఘటనతో పోల్చి చూపింది. ఆ సమయంలో సర్బానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి కాగా.. ఓ ఎంపీ మాట్లాడుతూ, హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అంటూ ప్రస్తావించారు. అలా పలుమార్లు జరిగింది కూడా. వాస్తవంగా అప్పుడు హిమంత అస్సాం మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలవడంతో హిమంత ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దీనిని ఉదహరిస్తూ.. ‘భాజపా తన తదుపరి ప్రధానిని నిర్ణయించుకుందా..?’ అంటూ హస్తం పార్టీ వ్యాఖ్యలు చేసింది. ఇది కేవలం పొరపాటేనని భాజపా నేతలు అంటున్నారు. గతంలో ఆ ఎంపీ అన్నదాన్నిబట్టి చూస్తే.. ఇది పొరపాటుగా అనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని