Assam: మణిపుర్‌ వాసులకు అస్సాం మానవతా సాయం

మణిపుర్‌లో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని అస్సాంలో ఆశ్రయం పొందుతున్న వారికి మానవతా సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. 

Updated : 23 Jun 2024 16:57 IST

దిస్పూర్‌: అస్సాం(Assam)లో తలదాచుకుంటున్న మణిపుర్‌ (Manipur) వాసులకు మానవతా సాయం అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) ఆదేశించారు. మణిపుర్‌లోని జిరిబామ్‌(Jiribam) ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల నుంచి తప్పించుకొని 1700 మంది ప్రజలు అస్సాంలోని కాచర్‌(Cachar) జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం మణిపుర్‌ నివాసితులకు కావాల్సిన సాయం అందజేయాలని సూచించారు.

జిల్లా కమిషనర్ ఝా మాట్లాడుతూ ప్రస్తుతం కాచర్‌లో కుకీ, హ్మార్, నాగా, మైతేయి తెగలకు చెందిన 1,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. జూన్‌ మొదటి వారంలో జిరిబామ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల అనంతరం అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అస్సాంలో తలదాచుకుంటున్న వారికి మానవతా సహాయాన్ని అందిస్తున్నామని వివరించారు. వీరు ఆశ్రయం పొందడానికి షెల్టర్లు, ఆహారం అందించామన్నారు. ఆయుధాలతో ఎవరూ కాచర్‌లోకి  ప్రవేశించకుండా మణిపుర్‌ సరిహద్దులో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.

గత ఏడాది మే నెలలో మణిపుర్‌లోని కుకీ, మైతేయి తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 225 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ సహాయ కేంద్రాలలో తలదాచుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని