Assam: ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సిందే.. సీఎం కీలక నిర్ణయం

జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం కరెంట్‌ బిల్లు చెల్లించదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.   

Updated : 17 Jun 2024 17:00 IST

గువాహటి: జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లుల(power bills)ను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Sarma) ఆదివారం వెల్లడించారు. తాను, చీఫ్ సెక్రటరీ జులై 1నుంచి ఈ నిబంధనను అనుసరిస్తామన్నారు.

‘‘గత 75 ఏళ్లుగా మన మంత్రులు, ప్రభుత్వ సీనియర్, సచివాలయ అధికారుల నివాసాలకు, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజలు చెల్లించే టాక్స్‌ సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్తు బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి ముగింపు పలుకుతున్నాం. నేనూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జులై 1నుంచి మా విద్యుత్ బిల్లులను మేమే చెల్లించడం ప్రారంభిస్తాం. ఇదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా వారి విద్యుత్ వినియోగానికి అయ్యే బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది’’ అని హిమంత బిశ్వశర్మ ఎక్స్‌ ఖాతా వేదికగా వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ బోర్డుకి వచ్చే నష్టాలను నివారించవచ్చని, బదులుగా వారు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉండదని సీఎం పేర్కొన్నారు. 

గువాహటిలోని రాష్ట్ర సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ వేడుకలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల గ్రిడ్-కనెక్ట్ రూఫ్‌టాప్, గ్రౌండ్-మౌంటెడ్ సోలార్ PV సిస్టమ్‌ను, జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్‌ను శర్మ ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ పవర్‌ను దశలవారీగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌరవిద్యుత్తు వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్తును ఆదా చేయడానికి సీఎం సెక్రటరీ, హోం, ఆర్థికశాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి 8 గంటలకు విద్యుత్తు ఆటో-డిస్‌కనెక్షన్ అమలుచేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 8,000 ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో ఈ విధానం అమలుచేస్తున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని