Bangladesh: ఆలయాలపై దాడి చేసిన వారిని వదిలేది లేదు: బంగ్లా ప్రధాని

దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా హామీ ఇచ్చారు.....

Published : 15 Oct 2021 15:20 IST

ఢాకా: దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా హామీ ఇచ్చారు. దుండగులు ఏ వర్గానికి చెందినవారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ‘‘కుమిల్లాలో జరిగిన ఘటనపై క్షుణ్నంగా దర్యాప్తు చేస్తాం. కారకులను వదిలిపెట్టేది లేదు. వారు ఏ మతానికి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. ఈ ఘటనపై ఇప్పటికే చాలా సమాచారం అందింది. ఇది సాంకేతికయుగం. ఈ ఘటనకు కారణమైన ప్రతిఒక్కరినీ సాంకేతికత సాయంతో వీలైనంత త్వరగా పట్టుకొని తీరతాం’’ అని ఢాకాలోని ఢాకేశ్వరీ జాతీయ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. 

కొంతమంది గుర్తు తెలియని ఛాందసవాదులు గురువారం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు 100 కి.మీ దూరంలో ఉన్న కుమిల్లా అనే ప్రాంతంలోని హిందూ ఆలయాలపై జరిపిన దాడులు ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసు కాల్పుల్లో నలుగురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు. దుర్గాపూజ మండపాల్లో దైవ దూషణతో మొదలైన ఉద్రిక్తత ఆ తర్వాత మందిరాలపై దాడికి దారి తీసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియోలతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం 22 జిల్లాలో ప్రత్యేక బలగాలను మోహరించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం వెంటనే దోషుల్ని శిక్షించాలని బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో హసీనా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని