PM Modi: ఆ మూడింటికీ కత్తెర వేయడమే నా ‘సర్జరీ’ స్టైల్‌: మోదీ

కరోనా సమయంలో కొన్ని దేశాల్లో ఒక్క వ్యాక్సిన్‌ డోసు కూడా దొరక్క జనం అల్లాడిపోగా.. మరికొన్ని దేశాల్లో ప్రజలకు నాలుగైదు డోసులు లభ్యం కావడం తనను బాధించిందన్నారు. అందువల్లే జీ20 సదస్సులో  వన్‌ ఎర్త్‌- వన్‌ హెల్త్‌ అని పిలుపునిచ్చిన సందర్భాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు.

Published : 12 Oct 2022 01:09 IST

అహ్మదాబాద్‌: రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌ అనేక వ్యాధుల బారిన పడిందని.. ఆ సమయంలో తమ ప్రభుత్వం పాత వ్యవస్థలను మార్చేందుకు ‘సర్జరీ’ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. గుజరాత్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని.. అహ్మదాబాద్‌లో రూ.1,275 కోట్లతో నిర్మించిన సివిల్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో కొన్ని దేశాల్లో ఒక్క వ్యాక్సిన్‌ డోసు కూడా దొరక్క జనం అల్లాడిపోగా.. మరికొన్ని దేశాల్లో ప్రజలకు నాలుగైదు డోసులు లభ్యం కావడం తనను బాధించిందన్నారు. అందువల్లే జీ20 సదస్సులో తాను వన్‌ ఎర్త్‌- వన్‌ హెల్త్‌ అని పిలుపునిచ్చిన సందర్భాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. గుజరాత్‌లో వైద్య వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు వైద్యులు అప్పట్లో తమకు సూచించిన మెడిసిన్‌, సర్జరీ, సంరక్షణ (కేర్‌) అనే మూడు అంశాలపై గట్టిగా కృషిచేశామన్నారు. 

‘‘20-25 ఏళ్ల క్రితం గుజరాత్‌ను అనేక వ్యాధులు బాధించాయి. ఆరోగ్య సంరక్షణలో వెనుకబాటు, విద్యుత్‌ కొరత, నీటి కొరత, పరిపాలనా లోపం, శాంతిభద్రతల సమస్య ఉండేవి. ఆ వ్యాధులన్నింటికీ మూలకారణం ఓటు బ్యాంకు రాజకీయం అనే అతిపెద్ద మహమ్మారి. సర్జరీ అంటే అర్థం పాత వ్యవస్థను మార్చడమే. నేను చేసే సర్జరీ ప్రభుత్వంలో నిష్క్రియ, అలసత్వం, అవినీతికి కత్తెర వేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలు (మెడిసిన్‌). కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేయడం, మానవ వనరులు, మౌలికసదుపాయాలు, ఆవిష్కరణలు, కొత్త ఆస్పత్రుల నిర్మాణం చేపట్టడం. మూడోది సంరక్షణ (కేరింగ్‌).. గుజరాత్‌ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో ఇదే అత్యంత ముఖ్యమైన అంశం. ఇందుకోసం మా ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పనిచేసింది. ప్రజల్లోకి వెళ్లాం.. వారి సమస్యల్ని  తెలుసుకున్నాం. అంతేకాదు.. కేవలం మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా హెల్త్‌ క్యాంపులు నిర్వహించిన తొలి రాష్ట్రం గుజరాతేనని వినమ్రంగా చెప్పగలను’’ అని మోదీ అన్నారు. గుజరాత్‌కు నరేంద్ర మోదీ  నాలుగు పర్యాయాలు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని