Babasaheb Purandare: ప్రముఖ రచయిత బాబాసాహెబ్‌ పురందరే కన్నుమూత

దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బాబాసాహేబ్‌ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Published : 15 Nov 2021 16:31 IST

దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బాబాసాహెబ్‌ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండురోజుల క్రితం పుణెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన... వెంటిలేటర్‌ సాయంతో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.  దేశప్రధాని మోదీతో సహా ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పురందరేతో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా గుర్తుచేసుకున్నారు.

‘‘మాటల్లో వ్యక్తపరచలేనంత బాధ కలిగింది. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో ఒక పెద్ద శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మరింత దగ్గరయ్యేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. బాబాసాహెబ్ పురందరే చమత్కారుడు, తెలివైనవాడు, భారతీయ చరిత్ర గురించి గొప్ప జ్ఞానం కలిగిన వేత్త. కొన్నేళ్లుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు దక్కింది. కొన్ని నెలల క్రితం, తన శతాబ్ది సంవత్సర కార్యక్రమంలో ప్రసంగించారు’’  అంటూ ట్వీట్‌ చేశారు.  బాబాసాహెబ్‌కు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో రచనలు

మహారాష్ట్రలోని బల్వంత్ మోరేశ్వర్ పురందరే.. బాబాసాహెబ్  పురందరేగా ప్రసిద్ధి. ఛత్రపతి శివాజీపై అనేక పుస్తకాలను రచించారు. ఆయన జీవితం మొత్తం చరిత్ర పరిశోధనలకే అంకితం చేశారు. 2019 జనవరి25న భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్, 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అందుకున్నారు. 200 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన శివాజీ  ‘జాంత రాజా’ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌, గోవాలోనూ ప్రాచుర్యం పొందింది. ఐదు భాషల్లో దీన్ని అనువదించారు. 1970ల్లో శివసేన అధ్యక్షుడు పార్టీ బాల్‌ ఠాక్రేతో కలిసి పనిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని