Demonetisation: ‘సుప్రీం’ చరిత్రాత్మక తీర్పు‌.. రాహుల్‌ సారీ చెబుతారా?: భాజపా

పెద్ద నోట్ల రద్దు(demonetisation) విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం(Supreme court) ఇచ్చిన తీర్పు పట్ల అధికార భాజపా హర్షం ప్రకటించింది. ఇప్పటివరకు దీన్ని విమర్శిస్తూ ప్రచారం చేసిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెబుతారా? అని కేంద్రమాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌((Ravi Shankar Prasad) )ప్రశ్నించారు.

Published : 02 Jan 2023 15:53 IST

దిల్లీ: పెద్ద నోట్ల రద్దు(demonetisation) విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు(Supreme court) ఇచ్చిన తీర్పుపై భాజపా(BJP) హర్షం వ్యక్తంచేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు(historic verdict)గా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దు(demonetisation)కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించింది. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు(Supreme court) సోమవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజారిటీతో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌(Ravi Shankar Prasad) విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అడ్డుకోవడమే కాకుండా వారి ఆర్థిక మూలాలకు అతి పెద్ద దెబ్బఅని నిరూపితమైందన్నారు. అలాగే, ఆదాయ పన్ను వ్యవస్థ బలోపేతమైందని.. ఆర్థిక వ్యవస్థను పరిశుభ్రం చేసిందని వ్యాఖ్యానించారు. ఇది చారిత్రక నిర్ణయమని.. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని పునరుద్ఘాటించారు. ఈ నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోన్న రాహుల్‌ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ఆయన దీన్ని తప్పుబడుతూ విదేశాల్లోనూ ప్రసంగాలు చేశారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఊపందుకున్న డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. గత ఏడాది అక్టోబరులోనే రూ.12 లక్షల కోట్ల విలువైన 730 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని