New Parliament: కొత్త పార్లమెంట్‌లో రాజదండం.. దాని చరిత్ర తెలుసా..?

ఆదివారం నుంచి భారత్‌కు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్‌ షా(Amit Shah)..ఒక కొత్త అంశం గురించి వెల్లడించారు. మరోసారి చరిత్రను కొత్తగా పరిచయం చేశారు.

Updated : 24 May 2023 15:29 IST

దిల్లీ: ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం(New Parliament Building) సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) ఒక బంగారు రాజదండాన్ని(Sceptre) స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) బుధవారం వెల్లడించారు. అలాగే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు. బ్రిటిషర్లు, భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తుచేశారు. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్‌ అయిన లార్డ్ మౌంట్‌బాటెన్‌.. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అందించారని చెప్పారు. ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారన్నారు. తమిళ పదమైన సెమ్మాయ్‌(ధర్మం) నుంచి  వచ్చిందని వెల్లడించారు. 

అసలు రాజదండం కథ ఎలా మొదలైందంటే..?

ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్‌, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్‌ బాటెన్‌.. నెహ్రూను ప్రశ్నించారట. వెంటనే నెహ్రూ పక్కనే ఉన్న రాజగోపాలాచారి(స్వతంత్ర భారత దేశపు మొదటి, చివరి భారతీయ గవర్నర్‌ జనరల్‌) వైపు తిరిగి సలహా కోరారు. అప్పుడు రాజాజీ .. తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని వివరించారు. కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి దానిని ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని తెలిపారు. చోళులు దానిని అనుసరించారని వెల్లడించారు. దాంతో ఆ రాజదండాన్ని తయారు చేసే పనిని నెహ్రూ.. రాజాజీకి అప్పగించారు.

అందుకోసం రాజగోపాలాచారి.. తిరువడుత్తురై అథీనం(ప్రస్తుత తమిళనాడులో ప్రఖ్యాత మఠం) ను సంప్రదించారు. రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు.. మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు. దాని పొడవు ఐదు అడుగులు ఉండగా..పై భాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు. న్యాయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు  చేశారు. ఆ మఠానికి చెందిన స్వామీజి ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్‌బాటెన్‌కు అందించి, దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారట. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధి చేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట. అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు  ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట.

ఈ రాజదండం చరిత్ర, ప్రాధాన్యత చాలామందికి తెలీదని అమిత్‌ షా(Amit Shah ) అన్నారు. ప్రస్తుత ఈ ఏర్పాటు.. మన సంప్రదాయాలను, ఆధునికతకు సంధానించే ప్రయత్నమని తెలిపారు. ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని