Odisha Accident Effect: ట్రైన్‌ మేనేజర్లు, కంట్రోలర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌.. రైల్వే బోర్డు కీలక సూచన

రైళ్లలో ప్రయాణం సురక్షితంగా సాగేందుకు వీలుగా ట్రైన్‌ మేనేజర్లు, సెక్షన్‌ కంట్రోలర్లకు వారి విధులు, బాధ్యతల గురించి తరచుగా కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపల్ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్లకు రైల్వే బోర్డు సూచించింది.

Published : 08 Jun 2023 22:08 IST

దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం భారతీయ రైల్వే (Indian Railways) చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా నిలిచింది. ఈ క్రమంలో రైల్వే భద్రతపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా తమ విధులకు సంబంధించి ట్రైన్‌ మేనేజర్లు, కంట్రోలర్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అన్ని రైల్వే డివిజన్లకు సూచించారు. దీన్ని ‘మోస్ట్‌ అర్జెంట్‌’ సూచనగా పరిగణించాలని తాజా అడ్వైజరీలో పేర్కొన్నారు.

రైళ్లలో ప్రయాణం సురక్షితంగా సాగేందుకు వీలుగా ట్రైన్‌ మేనేజర్లు, సెక్షన్‌ కంట్రోలర్లకు వారి విధులు, బాధ్యతల గురించి తరచుగా కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపల్ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్లకు రైల్వే బోర్డు సూచించింది. ఇప్పటికే ఈ వ్యవస్థ కొన్ని జోన్లలో ఉందని, మరికొన్ని జోన్లలోని స్టేషన్‌ మాస్టర్లు/పాయింట్స్‌మెన్‌కు అమలవుతుందని తెలిపింది. అయినప్పటికీ తాజా సూచనను అతి ముఖ్యమైనదిగా పరిగణించి, సీనియర్‌/అనుభవం ఉన్న ట్రైన్‌ మేనేజర్లతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టాలని సూచించింది. రోజువారీ విధులతోపాటు అసాధారణ పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించేలా సిబ్బందిని సిద్ధం చేయడమే తాజా సూచన ఉద్దేశమని తెలిపింది. దీంతోపాటు భద్రతపై రైల్వే సిబ్బంది మొత్తానికి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు కూడా ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని స్పష్టం చేసింది.

మరోవైపు, ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పులు చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వేశాఖ తాజాగా ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఇందులో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలతో ఆ దిశగా దర్యాప్తు కూడా జరుపుతోంది. రైల్వేశాఖ ఆదేశాల మేరకు సీబీఐ కూడా ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని