Mamata Banerjee : కేంద్రానికి వ్యతిరేకంగా.. మమతా బెనర్జీ నిరసన దీక్ష

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ధర్నాకు  దిగారు.  కోల్‌కతాలో నిరసన దీక్ష చేపట్టారు. రెండు రోజుల పాటు ఆమె ఈ ధర్నా కొనసాగించనున్నారు.

Updated : 29 Mar 2023 13:50 IST

కోల్‌కతా: రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నేడు స్వయంగా ధర్నాకు దిగారు.  ఈ మధ్యాహ్నం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఆమె నిరసన దీక్షకు కూర్చున్నారు. రెండు రోజుల పాటు దీదీ ఈ ధర్నా కొనసాగించనున్నారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ‘‘గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరా ఆవాస్‌ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మోదీ సర్కారు నిలిపివేసింది. ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇవ్వట్లేదు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. బెంగాల్‌పై కేంద్రం సవతి తల్లి వైఖరి ప్రదర్శిస్తోంది. అందుకే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనే ధర్నాకు దిగాను’’ అని దీదీ ఈ సందర్భంగా వెల్లడించారు. గురువారం సాయంత్రం వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సమయంలో దీదీ  కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం ఆసక్తికరంగా మారింది.  ఇటీవల సాగర్‌డిఘీలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో తృణమూల్‌ ఓటమి చవి చూసింది.  ఈ నేపథ్యంలో వచ్చే పంచాయతీ ఎన్నికలపై దృష్టిపెట్టిన దీదీ.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.  ఆ ఉప ఎన్నికలకు బాధ్యత వహించిన రాష్ట్ర మంత్రి గులాం రబ్బానీని కేబినెట్‌ నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మమతా బెనర్జీ.. అటు భాజపాకు, ఇటు కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తున్నట్లు కన్పిస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి ‘అతిపెద్ద  టీఆర్‌పీ’అని  విమర్శించిన ఆమె.. ఆ తర్వాత రాహుల్‌ అనర్హత విషయంలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం గమనార్హం. అదానీ వ్యవహారంపై ఖర్గే నేతృత్వంలోని విపక్షాల భేటీకి తృణమూల్‌ పార్టీ హాజరైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని