Amit sha: పోలీసుల థర్డ్‌ డిగ్రీపై హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

పోలీసుల థర్డ్‌ డిగ్రీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 25 May 2023 21:58 IST

గువాహటి: పోలీసుల థర్డ్‌ డిగ్రీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది థర్డ్‌ డిగ్రీ ప్రయోగించే కాలం కాదన్న హోం మంత్రి .. ప్రత్యామ్నాయంగా ఫోరెన్సిక్‌ విభాగాలను వాడుకోవాలని సూచించారు. అసోం గువాహటిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీకి అమిత్‌ షా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌ ఘర్షణలపైనా స్పందించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఇరు వర్గాలకు సూచించారు. త్వరలో మణిపూర్‌ వెళ్లనున్నట్టు తెలిపిన హోం మంత్రి అమిత్‌ షా.. మణిపూర్‌లో 3 రోజులు ఉండి శాంతి నెలకొల్పేలా చూస్తానని తెలిపారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని అమిత్‌షా జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఇప్పుడున్నన్ని స్థానాలు కూడా రావని అన్నారు. అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 44,703 మందికి నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు అందుకే పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్‌ చేసి విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. 

‘‘ రానున్న ఎన్నికల్లో 300 సీట్లలో భాజపా గెలుపొందుతుంది. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. లోక్‌సభలో ఇప్పుడున్న స్థానాలను కూడా కాంగ్రెస్‌ కాపాడుకోలేదు.’’ అని అమిత్‌షా విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అసెంబ్లీ నూతన భవనాలకు పునాది రాయి వేస్తే.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ లాంటివాళ్లే వెళ్లారు తప్ప.. గవర్నర్‌లను పిలిచారా? అని అమిత్‌షా ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడుతుంటే అడ్డుకునేందుకు కాంగ్రెస్‌  ప్రయత్నించిందని అన్నారు. భారత ప్రజలు మోదీకి మాట్లాడే అవకాశమిస్తే.. వారి నిర్ణయాన్ని గౌరవించకపోవడం దేశాన్ని అవమానించినట్లేనని షా మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని