Kashmir Killings: కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. అజిత్‌ డోభాల్‌తో అమిత్‌ షా భేటీ

జమ్మూకశ్మీర్‌లో సామాన్య పౌరులపై ఉగ్రవాదులు వరుసగా లక్షిత హత్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా

Published : 02 Jun 2022 16:18 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సామాన్య పౌరులపై ఉగ్రవాదులు వరుసగా లక్షిత హత్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో నార్త్‌ బ్లాక్‌లో జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కశ్మీర్‌ లోయలో సామన్యులకు భద్రత, ముష్కరులు దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

ఈ ఉదయం కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఎల్లాఖీ దేహతి బ్యాంక్‌లో ఉగ్రవాదులు చొరబడి.. బ్యాంకు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. విజయ్‌ తన సీట్లో పని చేసుకుంటుండగా.. ఓ ముష్కరుడు లోపలికి వచ్చి తుపాకీతో పలుమార్లు కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌ కొద్ది నెలల క్రితమే ఈ బ్యాంకుల్లో విధుల్లో చేరాడు.

కశ్మీర్‌లో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఇదే జిల్లాలోని గోపాల్‌పొర ప్రాంతంలోని ఓ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ పనిచేస్తోన్న రజిని బాలా అనే ఉపాధ్యాయురాలిని కాల్చి చంపారు. మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో ఎనిమిది లక్షిత హత్యలు జరిగాయి. ఇందులో ముగ్గురు ఆఫ్ డ్యూటీలో ఉన్న పోలీసులు, ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని