Bipin Rawat: బిపిన్‌ రావత్‌ దంపతులకు అమిత్ షా, రాహుల్‌ గాంధీ నివాళులు

హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక భౌతికకాయాలను దిల్లీలోని ఆయన

Updated : 10 Dec 2021 12:26 IST

దిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక భౌతికకాయాలను దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రావత్‌ దంపతులకు నివాళులర్పించారు. వారి పార్థివదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. సీడీఎస్‌ కుటుంబసభ్యులను ఓదార్చారు. 

ప్రముఖుల నివాళులు..

రావత్‌ దంపతులకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్ దామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, హరీశ్‌ రావత్‌, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ తదితరులు అంజలి ఘటించారు. 

ప్రముఖుల నివాళుల అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సైనిక సిబ్బంది నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామ్‌రాజ్‌ మార్గ్‌లోని రావత్‌ నివాసం నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. సాయంత్రం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

బ్రిగేడియర్‌ లిద్దర్‌ అంత్యక్రియలు పూర్తి..

ఈ ప్రమాదంలో మరణించిన బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిద్దర్‌ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఈ ఉదయం బ్రార్‌ స్క్వేర్‌ వద్ద లిద్దర్‌ భౌతికకాయానికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరికుమార్‌, ఐఏఎఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, ఇతర రక్షణశాఖ ఉన్నతాధికారులు అంజలి ఘటించారు. అనంతరం సైనిక లాంఛనాల నడుమ లిద్దర్‌కు తుదివీడ్కోలు పలికారు.

ప్రముఖుల నివాళులు.. మరిన్ని చిత్రాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని