Nirmala Sitharaman: తమిళనాడులో ఆర్థిక మంత్రికి చేదు అనుభవం..గ్యాస్‌ ధరలు తగ్గించాలని మహిళల డిమాండ్

ఎన్నికల(2024 General Elections) ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వంటగ్యాస్‌ ధరల పెంపుపై మహిళలు ఆమెను నిలదీశారు. ధరలు తగ్గించాలంటూ డిమాండ్‌ చేశారు.

Updated : 03 Apr 2023 18:37 IST

చెన్నై: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)  తమిళనాడులో పర్యటించారు. వచ్చే ఏడాది లోక్‌సభ(General Elections 2024) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలోని ఒక గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అందరికీ అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ తీరుపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వంటగ్యాస్‌ ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నారు. అయితే వంటగ్యాస్‌ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌ నిర్ణయిస్తుందని మంత్రి వారికి వివరణ ఇచ్చారు. ‘‘మన దేశంలో వంట గ్యాస్‌ లేదు.  దాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. గత రెండేళ్ల నుంచి ధరలు తగ్గలేదు’’ అని మంత్రి సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌ పాల్గొన్నారు.

గత నెల ఒకటో తేదీన గృహావసరాల సిలిండర్‌పై చమురు సంస్థలు రూ.50, 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై రూ. 350.50 పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో గృహ వినియోగ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.1,155, దిల్లీలో రూ.1,103, ముంబయిలో రూ.1,102.50, కోల్‌కతాలో రూ.1,129 చెన్నైలో రూ.1,118.50గా ఉంది. అయితే ఇటీవల 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై రూ. 91.50 మేర తగ్గించాయి. కానీ గృహవినియోగ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఏ మార్పు లేదు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని