Agnipath: బస్సులు, రైళ్లు తగలబెట్టే పోకిరీలు ఆర్మీకి అనర్హులే..!

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ (Ved Prakash Malik) సమర్థించారు.

Published : 18 Jun 2022 02:21 IST

ఆర్మీ మాజీ చీఫ్‌ వీపీ మాలిక్‌ వ్యాఖ్యలు..

దిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకాన్ని మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ (Ved Prakash Malik) సమర్థించారు. అయితే, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న పోకిరీలను తీసుకునేందుకు ఆర్మీ ఎన్నడూ ఆసక్తి చూపదని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళనల్లో బస్సులు, రైళ్లపై దాడులకు పాల్పడుతూ గూండాయిజం చేసేవారిని భారత సైన్యం కోరుకోదన్నారు. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కార్గిల్‌ యుద్ధంలో (Kargil War) భారత సైన్యాన్ని విజయపథంలో నడిపించిన మాజీ సైన్యాధిపతి వీపీ మాలిక్‌ ఈ విధంగా స్పందించారు.

‘సాయుధ బలగాలు (Armed Forces) అనేవి స్వచ్ఛందంగా పనిచేసే బలగాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది సంక్షేమ సంస్థ కాదు. దేశాన్ని అనుక్షణం రక్షిస్తూ.. దేశంకోసం పోరాడే ఉత్తమ పౌరులు ఇందులో ఉండాలి. బస్సులు, రైళ్లు తగలబెడుతూ గూండాయిజానికి పాల్పడేవారు సాయుధ బలగాల్లో ఉండాలని మేము కోరుకోము’ అని వీపీ మాలిక్‌ పేర్కొన్నారు. అయితే, ఇటీవల నియామకాలను (Army Recruitment) నిలిపివేసినందున పరీక్షను పూర్తిచేయని వారు ఎంతోమంది ఉన్నారన్న ఆయన.. ప్రస్తుతం వారిలో కొందరి వయసు పెరిగి ఆర్మీలో ప్రవేశానికి అనర్హులుగా మారిన మాట వాస్తవమన్నారు. ఈ విషయంలో వారి ఆందోళన, నిరాశను అర్థం చేసుకోగలనని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, అధిక సాంకేతికత కలిగిన వ్యవస్థలపై వీరికి శిక్షణ ఇస్తే సమర్థవంతంగా నిర్వహించగలుగుతారా..? అనే ప్రశ్నకు బదులిచ్చిన వీపీ మాలిక్‌.. ఇందుకోసం ఐటీఐతోపాటు ఇతర సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వారికి బోనస్‌ పాయింట్లు ఇవ్వడం జరుగుతోంది.. ఇటువంటి వారినే సాయుధ దళాల్లో కావాలని కోరుకుంటామని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చాక.. అందులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని