Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్‌ మోదీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్టుగానే తాను వేసిన పిటిషన్‌పైనా పట్నా కోర్టులో శిక్షపడుతుందని ఆశిస్తున్నట్టు భాజపా ఎంపీ సుశీల్‌ మోదీ అన్నారు.

Published : 30 Mar 2023 20:51 IST

పట్నా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై  తాను దాఖలు చేసిన పిటిషన్‌పైనా ఆయనకు తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్టు  భాజపా ఎంపీ సుశీల్ మోదీ(Sushil Modi) అన్నారు. 2019లో కర్ణాటకలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగా..  తాను దాఖలు చేసిన పిటిషన్‌పై పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం వచ్చే నెల రాహుల్‌ను విచారణకు పిలిచిందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. అందులో సుశీల్‌ మోదీ మాట్లాడుతూ.. ‘‘పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు  ఏప్రిల్‌ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది.  2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 ప్రకారం రాహుల్‌గాందీ వాంగ్మూలం రికార్డు చేసేందుకు కోర్టు సమన్లు ఇచ్చింది. సూరత్‌ కోర్టులో లాగే ఇక్కడి న్యాయస్థానం సైతం రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చి తగిన శిక్ష విధిస్తుందన్న విశ్వాసం ఉంది. రాహుల్‌ గాంధీ, ఆయన పార్టీ వారసత్వ రాజకీయాలను విశ్వసిస్తాయి. మోదీ లాంటి ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని సీట్లో కూర్చోవడాన్ని వారు భరించలేరు. అందుకే నిత్యం దూషిస్తుంటారు. ఈ ధోరణిని న్యాయవ్యవస్థ మాత్రమే సమర్థంగా నిరోధించగలదు’’ అని సుశీల్‌ మోదీ వ్యాఖ్యానించారు.  2019 ఏప్రిల్ 18న లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంలో రాహుల్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యానించిన ఐదు రోజుల తర్వాత సుశీల్‌ మోదీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన క్రిమినల్‌ పరువునష్టం కేసుపై ఇటీవల సూరత్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రాహుల్‌ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై  బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం..  ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చింది. మరోవైపు, ఈ తీర్పు ఆధారంగా  ఆ మరుసటి రోజే రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. దీనిపై భగ్గుమన్న కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన పోరాటానికి పలు విపక్షాలు తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని