AIIMS Chief: కరోనా మరణాలపై కచ్చితత్వం అవసరం

కరోనా మహమ్మారిపై పోరాడేందుకు కేంద్రం సరైన వ్యూహాలను రూపొందించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు కరోనా మృతుల సంఖ్యను కచ్చితత్వంలో వెల్లడించాలని ఎయిమ్స్‌ చీఫ్‌ డా.రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు....

Published : 13 Jun 2021 01:09 IST

డెత్‌ ఆడిట్‌ నిర్వహించాలన్న డా.గులేరియా

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు కేంద్రం సరైన వ్యూహాలను రూపొందించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు కరోనా మృతుల సంఖ్యను కచ్చితత్వంతో వెల్లడించాలని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వల్ల చెడు జరగడం తప్ప.. ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మరణాల కచ్చితత్వం కోసం డెత్‌ ఆడిట్‌ను నిర్వహించాలన్నారు. కొవిడ్‌ మరణాలను పలు రాష్ట్రాలు తగ్గించి వెల్లడిస్తున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఓ వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే.. అప్పటికే అతడికి కరోనా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కొవిడ్‌ కారణంగానే గుండెపోటు రావచ్చు. అయితే దీన్ని కరోనా మరణం కింద కాకుండా గుండెపోటు మృతి కింద లెక్కగడుతున్నారు. అన్ని ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు డెత్‌ ఆడిట్‌ నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీంతో మరణాలు సంభవించడానికి కారణంతోపాటు వాటిని తగ్గించేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో తెలుస్తుంది. మరణాలపై కచ్చితమైన సమాచారం ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది’ అని గులేరియా తెలిపారు. పరివర్తన చెందడం వైరస్‌ లక్షణమని.. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలు రకాల మ్యుటేషన్లు వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. 

ప్రజలు జాగ్రత్తగా ఉండి నిబంధనలు పాటిస్తేనే మహమ్మారి తగ్గుముఖం పడుతుందని గులేరియా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలని, అది కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. టీకా డోసుల మధ్య వ్యవధి గురించి మాట్లాడుతూ.. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య 12-13 వారాల వ్యవధి మంచిదేన్ననారు. దేశ జనాభాలో 75 శాతం మందికి టీకా ఇచ్చిన యూకే.. ఆస్ట్రాజెనెకా టీకా డోసు వ్యవధిని 12 వారాలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని