రూమ్‌ స్విట్జర్లాండ్‌ది.. బాత్‌రూమ్‌ ఫ్రాన్స్‌ది..!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో భోజనం చాలా బాగుంటుంది. మరికొన్ని హోటళ్లలో భిన్నమైన సేవలు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఒక్కో హోటళ్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, స్విట్జర్లాండ్‌లో జెనీవాకు

Updated : 22 Feb 2021 19:53 IST


(ఫొటో: గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో భోజనం చాలా బాగుంటుంది. మరికొన్ని హోటళ్లలో భిన్నమైన సేవలు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఒక్కో హోటళ్లో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, స్విట్జర్లాండ్‌లో జెనీవాకు సమీపంలోని లా క్యూర్‌ అనే గ్రామంలో ఉన్న ఓ హోటల్‌ భవనమే ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాగంటే.. ఆ హోటల్‌ ముందు నిలబడితే ఒక దేశంలో, లోపలికి వెళ్తే మరో దేశంలో అడుగుపెట్టినట్టు. ఒక గది ఒక దేశానికి చెందితే.. అందులోని బాత్‌రూం మరో దేశానికి చెందితుంది. విచిత్రంగా ఉంది కదా..!

వాల్లీ డెస్‌ డప్పెస్‌ అనే ప్రాంతం ఒకప్పుడు స్విట్జర్లాండ్‌ ఆధీనంలో ఉండేది. దాన్ని సొంతం చేసుకోవాలని ఫ్రాన్స్‌ పలుమార్లు ప్రయత్నించింది. చివరికి 1862లో స్విట్జర్లాండ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తమకు వాల్లీ డెస్‌ డప్పెస్‌ను స్వాధీనం చేస్తే.. అంతే విస్తీర్ణం ఉన్న మరో ప్రాంతాన్ని అప్పగిస్తామని ఫ్రాన్స్‌ చెప్పింది. ఇందుకు స్విట్జర్లాండ్‌ అంగీకరించడంతో లా క్యూర్‌ గ్రామంలో కొంత భాగాన్ని ఫ్రాన్స్‌ ఇచ్చేసింది. అయితే ఈ గ్రామం ఇరుదేశాల మధ్యలో ఉండటంతో గ్రామం రెండుగా చీలిపోయింది. కొందరు ఫ్రాన్స్‌ దేశంలోనే ఉండగా.. మరికొందరు స్విట్జర్లాండ్‌ పౌరులుగా మారిపోయారు. అయితే, ఒప్పందం ప్రకారం.. అప్పటికే నిర్మించిన ఇళ్లను విభజించే వీలు లేదు. 

ప్రభుత్వం కళ్లు గప్పి నిర్మాణం

1862 ఒప్పందంలోని నిబంధనను ఆసరాగా చేసుకున్న అప్పటి ఫ్రాన్స్‌కు చెందిన వ్యాపారవేత్త పొంతుస్‌.. ప్రభుత్వాలు సరిహద్దులను మార్చడానికి ముందే మూడంతస్తుల భవనం నిర్మించేశాడు. ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ సరిహద్దు మధ్యలో ఈ భవనం నిర్మిస్తే.. అది పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటుందని పొంతుస్‌ భావించాడు. ఈ మేరకు భవనంలో స్విట్జర్లాండ్‌ వైపు సరుకుల దుకాణం, ఫ్రాన్స్‌ వైపు బార్‌ ప్రారంభించాడు. 1921 నాటికి పొంతుస్‌ వారసులు ఈ భవన నిర్వహణ చూసుకోలేక జుల్స్‌-జీన్‌ అర్బెజ్‌ అనే వ్యక్తికి విక్రయించారు.

హోటల్‌గా మార్చి.. ఆకట్టుకొని

జుల్స్‌-జీన్‌ అర్బెజ్‌.. ఈ భవనాన్ని ‘ది హోటల్‌ అర్బెజ్‌’ పేరుతో హోటల్‌గా మార్చేశాడు. దీంతో ఈ హోటల్‌ రెండు దేశాల మధ్య ఉండి.. పర్యటకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ హోటల్‌లో దాదాపు అన్ని గదులు రెండుగా విభజించి ఉంటాయి. హోటల్‌లోని బార్‌ ఫ్రాన్స్‌కు చెందింది కాగా.. బార్‌ ముఖద్వారం నుంచి మిగతా ప్రాంతమంతా స్విట్జర్లాండ్‌దే. ఆ హోటల్‌లోని ప్రత్యేక హనీమూన్‌ సూట్‌ గది కూడా రెండుగా విభజించి ఉంటుంది. మంచంపై రెండు దిండ్లలో ఒక దిండు ఫ్రాన్స్‌, మరో దిండు స్విట్జర్లాండ్‌ జాతీయ పతాకాల రూపంలో ఉంటాయి. మెట్లలో కింది మెట్లు ఫ్రాన్స్‌కు, పై మెట్లు స్విట్జర్లాండ్‌కు చెందుతాయి. మరో గదిలో పడక, ఇతర ప్రాంతమంతా స్విట్లర్లాండ్‌కు, బాత్‌రూమ్‌ ఫ్రాన్స్‌కు చెందుతుంది. ఈ హోటల్‌ చిరునామాను ఇరు దేశాలు తమ దేశంలో ఉన్నట్లుగానే రాసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ హోటల్‌ యాజమాన్యం ఆదాయ పన్నును ఇరు దేశాలకు సమానంగా చెల్లించడం గమనార్హం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు