Jammu Kashmir: జోషీమఠ్‌ తరహాలో.. జమ్మూలోనూ ఇళ్లకు పగుళ్లు..!

జమ్మూ- కశ్మీర్‌లోని డోడా జిల్లాలోనూ ‘జోషీమఠ్‌’(Joshimath) తరహా ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు 20కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై.. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Published : 04 Feb 2023 00:41 IST

శ్రీనగర్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పర్యాటక క్షేత్రమైన జోషీమఠ్‌(Joshimath)లో భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ- కశ్మీర్‌(Jammu Kashmir)లోని డోడా(Doda) జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఠాఠ్రి పట్టణంలోని నయీ బస్తీలో 20కిపైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

‘డిసెంబర్‌లో ఇక్కడ ఓ ఇంటికి పగుళ్లు ఏర్పడ్డాయి. రెండుమూడు రోజుల క్రితం వరకు ఆరు భవనాలకు పగుళ్లు రాగా.. ఇప్పుడు ఒక్కసారిగా పెరగడం మొదలైంది. ఈ ప్రాంతం క్రమంగా కుంగిపోతోంది. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని జిల్లా ఎస్డీఎం అతర్‌ అమీన్‌ జర్గార్‌ వెల్లడించారు. మరోవైపు.. భూగర్భ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. స్థానికంగా పగుళ్లకు గల కారణాలను అన్వేషిస్తోంది. రోడ్ల నిర్మాణం, నీటి లీకేజీలు తదితర కారణాలతో భూమి కుంగిపోతోందని స్థానికులు చెబుతున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.

ఇదిలా ఉండగా.. జోషీమఠ్‌లో కొన్నాళ్లుగా భూమి కుంగుతుండటం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇప్పటివరకు 850కిపైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని ప్రమాదకర స్థాయికి దిగజారడంతో అధికారులు ప్రజలను అక్కడి నుంచి తరలించి కూల్చివేత పనులు చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని