mamata banerjee: సీఎంగా దీదీనే ఎలాగంటే..!

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొని ప్రత్యర్థుల్ని మట్టికరిపించిన మమతా బెనర్జీ, తాను మాత్రం ఓటమి పాలయ్యారు.

Updated : 03 May 2021 23:52 IST

6నెలల్లోపు గెలిచి వచ్చే వెసులుబాటు

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొని ప్రత్యర్థుల్ని మట్టి కరిపించిన మమతా బెనర్జీ, తాను మాత్రం ఓటమి పాలయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన సువేందు అధికారిపై పోటికీ దిగిన దీదీ, స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మే 5వ తేదీన ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కనున్నారు.

ఎన్నికల్లో గెలవకున్నా ముఖ్యమంత్రులుగా..

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవనప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకు బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌కుమార్‌ ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే సీఎంగా కొనసాగుతున్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండానే సీఎం పదవిని స్వీకరించారు. వీరిద్దరూ కూడా మండలి తరపున ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. బిహార్‌, మహారాష్ట్రలో శాసనమండలి ఉండటంతో వారికి ఈ అవకాశం లభించింది.

శాసనమండలి లేకుంటే..

పశ్చిమబెంగాల్‌లో శాసనమండలి లేదు. ఇలా మండలి లేని సందర్భాల్లో కచ్చితంగా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం, సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ఈ అవకాశాన్ని కలిపిస్తుంది. ఇందుకు ఏదైనా ఉప ఎన్నికలలో గెలవడమో లేదా వారి పార్టీకి చెందిన ఎవరో ఒక అభ్యర్థి(గెలిచే అవకాశం ఉన్న స్థానం) రాజీనామా చేసి పోటీ చేయమనే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్యే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరాత్‌ సింగ్‌ రావత్‌ పోటీ చేయకుండానే సీఎం పదవి చేపట్టిన విషయం తెలిసిందే.

తప్పక గెలవాల్సందే..లేకుంటే రాజీనామే..!

ఇలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లోగా తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిలోనూ ఓటమి చెందితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే 1970లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న త్రిభువన్‌ నారాయణ్‌ సింగ్‌ ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే, తృణమూల్‌కు వచ్చిన ఆధిక్యాన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీకి అటువంటి ప్రమాదం ఉండకపోవచ్చని విశ్లేషకుల అంచనా.

ఈ మూడుస్థానాల్లో ఏదో..?

పశ్చిమ బెంగాల్‌ తాజాగా మూడు స్థానాల్లో ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దహా స్థానానికి గత నెల 22న పోలింగ్‌ జరిగింది. అక్కడ తృణమూల్‌ తరపున పోటీ చేసిన కాజల్‌ సిన్హా తాజా ఫలితాల్లో గెలుపొందారు. అయితే, కొవిడ్‌ సోకిన సిన్హా.. ఎన్నికల ఫలితం రాకముందే (గత నెల 25న) మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి. ఇక ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్, కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూయడంతో శంషేర్‌గంజ్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. వీటిలో ఏదో ఒకదాన్నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని