అసలే రెడ్‌జోన్.. ఆపై హిడ్మా..!
2010 నుంచి ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల దాడుల క్రమాన్ని పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తుంది. పక్కాగా వేసవి సీజన్ మొదలయ్యాకే మావోయిస్టులు భద్రతా దళాలపై భారీ దాడులు చేశారు.
ఉచ్చులో చిక్కుకున్న దళాలు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
2010 నుంచి ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల దాడులను పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తోంది. పక్కాగా వేసవి సీజన్ మొదలయ్యాకే మావోయిస్టులు భద్రతా దళాలపై భారీ దాడులు చేశారు. ముఖ్యంగా మార్చి.. ఏప్రిల్ నెలల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కమాండర్ మాడ్వి హిడ్మా అలియాస్ సంతోష్ వ్యూహాలతోనే ఇవి అత్యధికంగా జరిగాయి. తాజాగా జరిగిన దాడి కూడా మావోయిస్టులు పక్కా ప్రణాళికతో చేసినట్లు తెలుస్తోంది. దళాలను మావోయిస్టులు ఉచ్చులోకి లాగారనే అనుమానాలూ ఉన్నాయి.
ఉప్పందించి.. ఉచ్చులోకి లాగి..
కొన్నేళ్ల నుంచి బీజాపూర్-సుక్మా ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు హిడ్మా కోసం సీఆర్పీఎఫ్, కోబ్రా, పోలీస్ దళాలు జల్లెడ పడుతున్నాయి. దీన్ని అదునుగా చేసుకొని దళాలను ఉచ్చులోకి లాగినట్లు తెలుస్తోంది. బీజాపూర్-సుక్మా సమీపంలోని అడవుల్లో హిడ్మా సహా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు దళాలకు సమాచారం అందింది. ఈ సమాచారం మావోయిస్టులే కావాలని పోలీసులకు చేరేలా చేశారు.
దీంతో వందల కొద్దీ సిబ్బందితో గాలింపు చేపట్టారు. వారికి ఎవరూ దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టిన సమయంలో హఠాత్తుగా దాడి చేశారు.
అసలు గాలింపు క్రమంలోనే ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ను నిర్లక్ష్యం చేశారని భద్రతా నిపుణులు అభిప్రాయపడ్డట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనం వెల్లడించింది. కూంబింగ్ చేసే సమయంలో సాధారణంగా ఎత్తయిన ప్రదేశాల్లో దళాలు నడవాలి. అదే లోయల్లో నడిస్తే కొండలపై నుంచి మావోయిస్టు తేలిగ్గా కాల్పులు జరిపే ప్రమాదం ఉంటుంది. తాజా దాడిలో భద్రతా దళాలు రెండు కొండల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎండాకాలం కావడంతో చెట్ల ఆకులు రాలిపోయి ఉంటాయి. దీంతో కొండ దిగువన దళాల కదలికలు స్పష్టంగా మావోలకు కనిపిస్తుంటాయి. అందుకే, మావోలు భారీ దాడులకు ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో సమయాన్నే ఎంచుకొంటారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేకాదు.. గ్రామాల్లోకి వెళ్లడం మరింత ప్రమాదకరం.. అక్కడ మావోయిస్టులు నక్కి ఉండే అవకాశాలు దండిగా ఉంటాయి. మానవ కవచాలను అడ్డంపెట్టుకొని కాల్పులకు తెగబడితే భద్రతా దళాల పని మరింత కష్టంగా మారుతుంది. గాలింపులో భాగంగా దళాలు జిర్గాన్, టేకులగూడెం గ్రామాలను దాటి వెళ్లాయి. ఆ సమయంలో గ్రామాలు పూర్తి నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు కూడా తాము ఉచ్చులో చిక్కుకున్న విషయాన్ని గుర్తించలేదని గాయపడిన ఓ జవాన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో చెప్పారు. తిరుగుప్రయాణంలో జరిగిన దాడి సమయంలో భద్రతా దళాలు సమీపంలోని టేకులగూడెం గ్రామంలోకి ప్రవేశించాయి. అక్కడ దాడి తీవ్రత మరింత పెరిగిపోయింది.
దాడిలో బెటాలియన్ నంబర్ 1
సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1’ ఈ మారణకాండలో పాల్గొంది. ఈ దళం హిడ్మా నేతృత్వంలో పనిచేస్తుంది. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని పేరు. హిడ్మా నేతృత్వంలో జరగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అందుకే అతడు అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్రకమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా.
వీరప్పన్ స్టైల్‌లో..
వీరప్పన్ కర్ణాటక-తమిళనాడు అడవుల్లో పాతుకుపోవడానికి కలిసొచ్చిన పరిస్థితులే ఇప్పుడు మావోనేత హిడ్మాకు కలిసొస్తున్నట్లు భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. హిడ్మా స్థానిక ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్థుల మద్దతు లభిస్తోంది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతను ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్‌లో ఉండటం కూడా అతనికి కలిసి వస్తోందని వీరప్పన్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించిన మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుత కశ్మీర్ గవర్నర్ సలహాదారు విజయ్‌కుమార్ గతంలో తెలిపారు. విజయ్‌కుమార్ గతంలో హోంశాఖకు వామపక్ష తీవ్రవాదంపై పోరులో సలహాదారుగా పనిచేశారు.
సుక్మా చుట్టుపక్కల అడవుల్లోని మార్గాలపై హిడ్మాకు బలమైన పట్టుంది. అడవుల్లో జరిగే పోరు ఎప్పుడూ స్థానికులకే అనుకూలంగా ఉంటుంది. ఇదే విషయం గతంలో వీరప్పన్‌కు, ఇప్పుడు హిడ్మాకు అనుకూలంగా మారింది. పాఠశాలలో కేవలం 10వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లిష్ మాత్రం చక్కగా మాట్లాడగలడని 2015లో ఫిబ్రవరిలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నాడు.
10 ఏళ్లలో 175 జవాన్ల మృతి
2010లో చింతలనార్ మారణ హోమం నుంచి నేటి వరకు దంతెవాడ-సుక్మా-బీజాపూర్ జిల్లాల్లో 175 మంది భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చింతలనార్ ఎన్‌కౌంటర్‌లోనే 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. జాతకం కుదరలేదని మోసం!
-
General News
Hyderabad: ఇంటి గోడ కూలి ముగ్గురి చిన్నారులకు గాయాలు
-
Crime News
UP: 42 ఏళ్ల క్రితం 10 హత్యలు.. 90 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. పోలీసు కస్టడీకి విద్యుత్‌శాఖ డీఈ రమేశ్
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Crime News
Andhra News: పింఛను తీసుకునేందుకు వచ్చి.. ఒడిశా రైలు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి