Mamata Banerjee: ‘నీ పొట్ట ఏంటి బాబూ బస్తాలా ఉంది’.. పార్టీ నేతపై దీదీ ఛలోక్తులు

పశ్చిమ బెంగాల్‌​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ టీఎంసీ నేతల మధ్య జరిగిన ఓ సమావేశం ఆద్యంతం నవ్వులు పూయించింది.......

Updated : 31 May 2022 16:59 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ టీఎంసీ నేతల మధ్య జరిగిన ఓ సమావేశం ఆద్యంతం నవ్వులు పూయించింది. పలువురిపై దీదీ ఛలోక్తులు విసిరారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పరిపాలనా సమీక్ష సమావేశం నిర్వహించిన దీదీ వారితో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారీకాయుడైన జల్దా మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ సురేశ్‌కుమార్‌ అగర్వాల్‌ వంతు వచ్చింది. ఆయన సీఎంతో ఏదో విషయం చెబుతుండగా.. ఆమె మధ్యలో కలగజేసుకున్నారు. ‘బస్తా లాంటి నీ పొట్ట చూస్తుంటే నువ్వు కిందపడిపోతావ్ అనిపిస్తోంది. నీ ఆరోగ్యం బాగానే ఉందా?’ అని నవ్వుతూ అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘నాకు మధుమేహం, బీపీ లాంటివి ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉన్నాను మేడం’ అని బదులిచ్చాడు.

వారి మధ్య సంభాషణ అంతటితో ఆగలేదు. తాను రోజూ వర్కవుట్లు కూడా చేస్తానని సీఎంను నమ్మించే ప్రయత్నం చేశారు ఆ ఛైర్‌పర్సన్‌. కానీ ఆమె మాత్రం నమ్మలేదు. నీకు కచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండి ఉంటుంది. నీ ‘మధ్యప్రదేశ్’ (పొట్టను ఉద్దేశిస్తూ) చాలా భారీగా ఉంది అని మరోసారి అయన్ను ఇరకాటంలో పడేశారు. అయితే పొట్ట పెరగడానికి అసలు కారణమేంటో చివరకు సురేశ్‌ వెల్లడించాడు. తాను ప్రతిరోజు ఉదయం పకోడీలు, బజ్జీలు తింటానని, అది చిన్నప్పటి నుంచి అలవాటని చెప్పుకొచ్చారు. కానీ రోజూ వ్యాయామం చేస్తానని చెప్పుకొచ్చారు.

ఈ సమాధానం విని దీదీ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ‘అంత ఉదయం పకోడీలు ఎలా తింటున్నావ్ బాబు. అలా తింటే నీ పొట్ట ఎప్పటికీ కరగదు. నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నావో చెప్పు. నువ్వు ఎలాంటి ఎక్సర్​సైజ్ చేస్తావో చెప్పు’ అని అడిగారు. అందుకు ఛైర్‌పర్సన్ బదులిస్తూ ‘ప్రతిరోజు ప్రాణాయామం చేస్తా. ఈ క్రమంలో 1000 సార్లు శ్వాస పీల్చి వదులుతా’ అని తెలిపారు. కానీ దీదీ ఆ విషయాన్ని నమ్మలేదు. ‘అది అసాధ్యం. నేను నమ్మను. నువ్వు ఇప్పుడు నాముందు అలా 1000 సార్లు చేసి చూపిస్తే నీకు రూ.10వేలు ఇస్తా. నీకు ప్రాణాయామంలో శ్వాస ఎలా తీసుకోవాలో, ఎలా వదలాలో కూడా తెలియదు’ అనడంతో సమావేశంలో ఉన్న సభ్యులంతా పగలబడి నవ్వారు.

‘ఇంత బరువు ఉన్న నువ్వు వెంటనే పకోడీలు తినడం మానెయ్. వ్యాయామం మొదలుపెట్టు. అప్పుడే పొట్ట కరుగుతుంది. నెలరోజులు అన్నమే తిను. రాత్రిపూట తిన్న తర్వాత ఒక కిలోమీటర్ నడువు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఉండు’ అని సురేశ్‌కు సీఎం పలు ఆరోగ్య చిట్కాలు సూచించారు. ఇలా చేస్తున్నావో లేదో నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని కూడా పేర్కొన్నారు. సీఎం అడిగిన ప్రశ్నలకు సురేశ్‌ నవ్వుతూనే సమాధానం చెప్పారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని