Updated : 17/02/2021 14:54 IST

కరోనాపై కంగారూ వర్సెస్‌ డ్రాగన్‌..!

  ఆస్ట్రేలియాపై చైనా ప్రతాపం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనాపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఆస్ట్రేలియాను చూస్తే అర్థమవుతుంది. చైనా తన ఆర్థిక శక్తి బలప్రదర్శనకు వేదికగా ఆస్ట్రేలియాను ఎంచుకొంది. దీంతో ఆసీస్‌ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడింది.

ప్రపంచం మొత్తం కొవిడ్‌ పాకడం వెనుక చైనా నిర్లక్ష్యం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిని చైనాపై గుర్రుగా ఉన్నాయి. కొవిడ్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు నిర్వహించాలని ఆస్ట్రేలియా ధైర్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థను నిలదీసింది. ఇది డ్రాగన్‌కు కోపం తెప్పించింది. ఆస్ట్రేలియాకు తన బలం ఏమిటో రూచి చూపించాలనుకుంది. అన్ని వైపుల నుంచి ఆసీస్‌ను నిస్సహాయంగా మార్చేలా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే కఠినమైన వాణిజ్య ఆంక్షలను తీసుకురావడంతోపాటు.. ఆస్ట్రేలియా ఎగుమతులపై దష్ప్రచారం చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

దిగుమతులపై ఆంక్షలు..

ఆస్ట్రేలియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనా. ఏటా దాదాపు 150 బిలియన్‌ డాలర్ల విలువైన బొగ్గు, ఎల్‌ఎన్‌జీ, ఐరన్‌ఓర్‌, వైన్‌, మాంసం వంటివి ఆస్ట్రేలియా ఎగుమతి చేస్తుంది. వీటిల్లో అత్యధికభాగం చైనాకు ఎగుమతి అవుతాయి. మొత్తం ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 55శాతం చైనాకు వెళతాయి. అంటే ఆస్ట్రేలియాలో అత్యధిక మంది ఉపాధికి చైనా పరోక్షంగా కారణం అవుతోంది. ఈ విషయం బాగా తెలిసిన డ్రాగన్‌ ఆసీస్‌ నోరు నొక్కడానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆయుధంగా చేసుకొంది. ఆస్ట్రేలియా ఉత్పత్తులను వేరే వాటితో భర్తీ చేస్తామంటూ తొలుత చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత ఆసీస్‌ నుంచి వచ్చే బొగ్గు, బార్లీ, కాపర్‌, చక్కెర, కలప, వైన్‌ వంటి వాటిని కొన్ని నెలల కిందటి నుంచి అప్రకటిత బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. చైనా వ్యాపారులు వీటిని కొనుగోలు చేయకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తనకు అవసరమైన ఐరన్‌ ఓర్‌, ఎల్‌ఎన్జీలను మాత్రమే అనుమతిస్తోంది.

మొత్తం ఆసీస్‌ ఎగుమతుల్లో 9శాతం బొగ్గు నుంచే లభిస్తుంది. తూర్పు ఆస్ట్రేలియాలోని గనుల నుంచి ఇది చైనాకు వెళుతుంది. ఇది చాలా పెద్దమొత్తం. ఆసీస్‌ నుంచి వచ్చే బొగ్గు నౌకలను అన్‌లోడింగ్‌ చేయనీయకుండా  పోర్టుల్లో నెలల కొద్దీ నిలిపేసింది. జూన్‌-జులై మధ్యలో చైనా చేరుకొన్న నౌకల్ని బొగ్గు అన్‌లోడ్‌ చేయనీయకండా ఆపేసింది. దీంతో సిబ్బంది వాటిల్లోనే నెలలకొద్దీ ఉండిపోయారు. ఇక్కడే ఉన్న ఎంవీ అనస్తాసియా, జగ్‌ ఆనంద్‌ అనే రెండు నౌకల్లో పదుల సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయారు. తాజాగా మానవతా దృక్పథంతో వాటిల్లోని బొగ్గును అన్‌లోడ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చైనా పేర్కొంది. 8.5లక్షల టన్నుల కోకింగ్‌కోల్‌ అన్‌లోడ్‌ చేయనున్నారు. దీంతో కొన్నిరోజుల క్రితం భారతీయు సిబ్బంది కూడా వెనక్కి వచ్చారు. 2020లో చైనా 306 మిలియన్‌ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంది. వీటిల్లో 57శాతం థర్మల్‌ కోల్‌, 40శాతం కోకింగ్‌  కోల్‌ ఆసీస్‌ నుంచి వచ్చింది.

కుదేలైన ఆసీస్‌ వైన్‌ వ్యాపారం

ఆస్ట్రేలియా వైన్‌పై చైనా ఆంక్షల కత్తిని దూసింది. ఆస్ట్రేలియా సంస్థలు కారుచౌకగా వైన్‌ను డంప్‌ చేస్తున్నాయంటూ వైన్‌ తయారీ సంస్థలపై నవంబర్‌లో యాంటీ డంపింగ్‌ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. దీంతో డిసెంబర్‌లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. వాస్తవానికి ఆసీస్‌లో తయారయ్యే వైన్‌కు చైనానే అతిపెద్ద మార్కెట్‌. ఈ మార్కెట్‌ విలువ సుమారు 840 మిలియన్‌ డాలర్లు. ఏప్రిల్‌లో ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కొవిడ్‌పై అంతర్జాతీయ దర్యాప్తు కోరినప్పటి నుంచి చైనా ఆగ్రహంగా ఉంది. ఒక దశలో ఆస్ట్రేలియాలోని చైనా దౌత్యవేత్త చెన్‌ జింగీ స్పందిస్తూ.. ఆసీస్‌ ఆర్థికంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ఆసీస్‌ బీఫ్‌ ఎందుకు తినాలి.. ఆసీస్‌ వైన్‌ ఎందుకు తాగాలి’  అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే బీఫ్‌, వైన్‌ బొగ్గుపై ఆంక్షలు విధించారు. ఆసీస్‌ వైన్‌ తరలిస్తున్న నౌకలు నెలల కొద్దీ చైనా తీరంలో నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. దీంతోపాటు భారీ సుంకాలను విధించింది.

ఆసీస్‌పై దుష్ప్రచారం..!

ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెడ్డపేరు తెచ్చేలా ఏకంగా చైనా విదేశాంగశాఖ సిబ్బందే ప్రచారానికి తెరలేపారు. ఆస్ట్రేలియా సైనికులు అఫ్గానిస్థాన్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ గత నవంబర్‌లో చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ కొన్ని ఫొటోలను ట్వీట్‌ చేశారు. ఇవి పెను సంచలనానికి దారితీశాయి. చివరికి ఆ ఫొటోలు ఎడిట్‌ చేసినవిగా తేలాయి.

ఇక కరోనా వైరస్‌ పుట్టుక కూడా ఆస్ట్రేలియాలోనే జరిగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు కూడా చైనా ప్రయత్నించింది. ఆసీస్‌ నుంచి దిగుమతి అయిన శీతలీకరించిన గొడ్డుమాంసం నుంచి కరోనా వ్యాపించించి ఉంటుందని చైనా పర్యటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందంతో ఓ  అనుమానం వ్యక్తం చేయించింది. ఇలాంటి వాదనే గతంలో చైనా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని