modi: ప్రధాని పర్యటనకు పక్కా ప్లానింగ్‌.. ఎస్పీజీ కనుసన్నల్లో అణువణువు..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(modi) పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్యం వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రతా ఏర్పాట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ అణ్వస్త్రదేశం.. మన దేశ అణ్వస్త్రాలను ప్రయోగించే ‘స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌’ ప్రధాని

Updated : 08 Jan 2022 06:26 IST

 అవసరమైతే ప్రభుత్వ పెద్దకు కూడా ‘నో’ చెప్పొచ్చు


 
ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(modi) పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భారీ భద్రతా వైఫల్య వ్యవహారం  దేశవ్యాప్తంగా కాకపుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని భద్రతా ఏర్పాట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ అణ్వస్త్రదేశం.. అణ్వస్త్రాలను ప్రయోగించే ‘స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌’ ప్రధాని కనుసన్నల్లోనే పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో అణు రహస్యాలు ఆధీనంలో ఉంచుకొన్న ప్రధానికి ఏ స్థాయిలో భద్రత ఉండాలో ఊహించుకోవచ్చు. అమెరికాలో ‘న్యూక్లియర్‌ ఫుట్‌బాల్‌’ను ఆధీనంలో ఉంచుకొనే అధ్యక్షుడి భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన భద్రతకు ‘సీక్రెట్‌ సర్వీస్‌’ విభాగం అన్నీ తానై పనిచేస్తుంది. అలానే భారత్‌లో ప్రధాని భద్రతను ‘స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌’ (spg) చూసుకొంటుంది.

ఇందిరా గాంధీ హత్యతో లోపాలు బయటపడి..

రాజ్యాంగం ప్రకారం దేశాధినేత రాష్ట్రపతి.. కానీ, ప్రజలు ఎన్నుకొన్న ప్రధాని వద్ద సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. దీంతో ఆయన భద్రతకు సైన్యంలోని ప్రెసిడెన్షియల్స్‌ బాడీగార్డ్స్‌ (పీబీజీ) బాధ్యత వహిస్తుంది. కానీ, ప్రధాని భద్రతను మాత్రం 3000 మంది మెరికల్లాంటి సిబ్బందితో కూడిన స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) చూసుకుంటుంది. వాస్తవానికి 1984లో ఇందిరా గాంధీ హత్యకు ముందు వరకు ప్రధాని నివాస భద్రత వంటివి దిల్లీ పోలీస్‌లోని డీసీపీ స్థాయి అధికారి అధ్వర్యంలో స్పెషల్‌ సెక్యూరిటీ డిస్ట్రిక్ట్‌ చూసుకొనేది. 1981 నుంచి ప్రధాని ప్రయాణ భద్రత,రోడ్డు సెక్యూరిటీలను చూసుకొనేందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ, 1984లో ఇద్దరు దిల్లీ పోలీసులు నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రధాని భద్రతకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీలు సూచించాయి. దీంతో 1985 ఏప్రిల్‌లో 819 మందితో ఎస్పీజీ (ప్రత్యేక రక్షణ దళం)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దళంలో 3,000 మంది సిబ్బంది ఉన్నారు.

ప్రధాని భద్రతే లక్ష్యం..!

ప్రధాని, ఆయన నివాసం, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం వీరి విధి. ఆయన రక్షణకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ‘బ్లూబుక్‌’లోని అంశాలను కచ్చితంగా అనుసరిస్తుంది. ప్రధాన మంత్రికి సంబంధించిన ప్రతి పర్యటనపై ఎస్పీజీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఈ క్రమంలో బ్లూబుక్‌లో నిబంధనల ప్రకారం కేంద్ర ఏజెన్సీలు, ఆయా రాష్ట్రాల పోలీసులను సమన్వయం చేసుకొంటుంది.

* ముందుగా నిర్ణయించిన పర్యటనకు మూడు రోజుల ముందు ఎస్పీజీ అధికారులు, ఆయా రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, జిల్లా కలెక్టర్‌తో ఏఎస్‌ఎల్‌ (అడ్వాన్స్డ్‌ సెక్యూరిటీ లిఏజాన్‌) డ్రిల్‌ నిర్వహించి లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు. ప్రధాని పర్యటనలో ప్రతినిమిషం భద్రతా వలయాన్ని కొనసాగించే విషయంపై ఏర్పాట్లను చర్చిస్తారు. ఒక్కసారి ఏఎస్‌ఎల్‌ (ASL) మీటింగ్‌ ముగిశాక దానిలో పాల్గొన్న అధికారులు కచ్చితంగా నివేదికపై సంతకాలు చేస్తారు.

* ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రయాణించాల్సిన  వాయు, రోడ్డు, రైలు మార్గాల ఎంపికకు కేంద్ర, స్థానిక ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఒక్కసారి ఆ ప్రదేశానికి చేరుకొన్నాక వేదికపైకి ప్రధాని చేరుకొనేందుకు అవసరమైన మార్గాలను సిద్ధం చేయడంపై దృష్టిపెడతారు. సాధారణంగా హెలికాఫ్టర్‌, లేదా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల్లోని ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు, వేదిక భద్రతను అంచనా వేస్తారు.

* ప్రధాని ప్రసంగించే వేదికపై అగ్నిప్రమాదాలను ఎదుర్కొనే ఏర్పాట్లు పక్కాగా ఉండేట్లు చూస్తారు. పర్యటన రోజు వాతావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటారు.

* ప్రధాని పర్యటన మార్గంలో దాడులకు అనుగుణంగా ఉండే గుబురు పొదలను తొలగించాలని ఎస్పీజీ కోరవచ్చు. దీంతోపాటు ఇరుగ్గా ఉండే మార్గాలను ముందే గుర్తించి అక్కడ ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయిస్తుంది.

ప్రత్యామ్నాయ ప్రణాళిక..

ప్రధాని పర్యటనలో హఠాత్తుగా వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని కూడా ఓ ప్రణాళిక ఉంటుంది. అందుకే ఎస్పీజీ వాతావరణ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రధాని హెలికాప్టర్‌లో ప్రయాణించలేని సమయంలో రోడ్డు మార్గం వాడేందుకు సిద్ధంగా ఉంచుతారు. ఈ కారణంతోనే ప్రధాని పర్యటన సమయంలో కొన్ని మార్గాల్లో ముందుగానే విస్తృత తనిఖీలు చేసి సిబ్బందిని మోహరిస్తారు. ఎందుకంటే ప్రధాని పర్యటన చివరి నిమిషంలో భద్రతా సిబ్బంది హెలికాప్టర్‌ కాకుండా రోడ్డు మార్గం ఎంచుకొన్నా ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు ఉంటాయి. వాస్తవానికి ప్రధాని పర్యటనలో తరచూ మార్పులు జరుగుతుంటాయి. హెలికాప్టర్‌ వాడాలి అంటే.. కనీసం కిలోమీటర్‌ దూరంలోనివి కూడా స్పష్టంగా కనిపించేలా వాతావరణం ఉండాలి. అందుకే శీతాకాలంలో ప్రధాని పర్యటనకు రోడ్డు మార్గాలనే ఎక్కువగా ఎంచుకొంటారు. రోడ్డు మార్గంపై రాష్ట్ర పోలీసులు క్లియరెన్స్‌ ఇవ్వకపోతే పర్యటన రద్దు చేసుకొంటారు.

ఎస్పీజీ ప్రధానికి భద్రత కల్పిస్తుంది.. కానీ, రోడ్‌ క్లియరెన్స్‌, ఇంటెలిజెన్స్‌ సేకరణ, వేదిక భద్రత, ప్రజల రద్దీని కంట్రోల్‌ చేయడం రాష్ట్ర పోలీసులే చూసుకొంటారని మాజీ యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర పోలీసులు భద్రతాలోపాలను అంచనా వేస్తారు. అవసరమైన బలగాల మోహరింపు.. కొన్ని కీలక ప్రదేశాల్లో స్నైపర్లను నియమిస్తారు.

ప్రధానికి కూడా ‘నో’ చెప్పొచ్చు..

ప్రధాని ర్యాలీలు, రోడ్‌షోల నిర్వహణ కత్తిమీద సాములాంటిది. ఇక్కడ ఎస్పీజీ(spg), రాష్ట్ర పోలీస్‌ సిబ్బందితోపాటు ఎస్పీ స్థాయి అధికారి సాధారణ దుస్తుల్లో భద్రతను పర్యవేక్షిస్తారు. ర్యాలీల సమయంలో ప్రధాని చుట్టూ సాధారణ దుస్తుల్లో కూడా భద్రతా సిబ్బంది మోహరించి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయా పార్టీల కార్యకర్తల వలే ప్రధాని వెన్నంటి ఉంటారు.

రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. కొన్ని సందర్భాల్లో ప్రధానే స్వయంగా ప్రొటోకాల్‌ మినహాయింపు కోరతారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎస్పీజీ ఆయన కోరికను కూడా తిరస్కరించవచ్చని మాజీ ఎస్పీజీ చీఫ్‌ సంజీవ్‌ దయాళ్‌ వెల్లడించారు.

ఎస్పీజీ సిబ్బందికి కఠిన శిక్షణ..

ప్రధాని భద్రతపై సగటున రోజుకు రూ.1.6 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఎస్పీజీలో నియామకాలు కొనసాగుతూనే ఉంటాయి.  వీరికి అత్యంత కఠినమైన దేహదారుఢ్య శిక్షణ, కచ్చితమైన గురితో కాల్చడం, వెన్నుపోటు దాడులను ఎదుర్కొనేలా కమ్యూనికేషన్లు వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో నిత్యం కొత్త అంశాలు వచ్చి చేరతాయి.

వీరు సాధారణంగా శీతాకాలంలో బిజినెస్‌ సూట్స్‌, కళ్లజోడు ధరించి ప్రధాని చుట్టూ ఉంటారు. టూవే ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్లు అందించే ఇయార్‌ పీస్‌లు, గ్లోక్‌-17 హ్యాండ్‌ గన్స్ వాడతారు. వేసవి సఫారీ సూట్స్‌ ధరిస్తారు.  అత్యాధునిక ఎఫ్‌ఎన్‌-హెర్‌స్టాల్‌ పీ 90 సబ్‌మిషిన్‌ గన్లు, ఫోల్డబుల్‌ బాలిస్టిక్‌ షీల్డ్‌ ( ప్రధాని పక్కన కనిపించే సూట్‌కేసులు వంటివి) వాడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని