అక్కడ వర్షం కురిసిన రాత్రి.. 

కోజికోడ్‌లో విమాన ప్రమాదం జరిగిన రన్‌వే ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇలాంటి వాటిని టేబుల్‌టాప్‌ రన్‌వేలు అంటారు. వీటిపై ల్యాండింగ్‌ సవాళ్లతో కూడుకొన్నది. సాధారణ రన్‌వేలపై విమానం ఒక ‘ఓవర్‌ షూట్‌‌’ అయితే మరికొంచెం ముందుకు పోయి

Updated : 10 Aug 2020 09:26 IST

 విమానం ‘ఓవర్‌ షూట్‌‌’ అయితే...  

 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేక కథనం

కోలికోడ్‌లో ఇటీవల విమాన ప్రమాదం జరిగిన రన్‌వే ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇలాంటి వాటిని టేబుల్‌టాప్‌ రన్‌వేలు అంటారు. వీటిపై విమానం ల్యాండింగ్‌ సవాళ్లతో కూడుకున్నది. సాధారణ రన్‌వేలపై విమానం ‘ఓవర్‌ షూట్‌’ అయితే మరికొంచెం ముందుకుపోయి ఆగడానికి తగిన స్థలం ఉంటుంది. కానీ, టేబుల్‌టాప్‌ రన్‌వేలపై ల్యాండింగ్‌ నిర్ణీత ప్రదేశాన్ని దాటి ముందుకు వెళితే ఆ విమానం లోయ వంటి ప్రదేశంలోకి వెళ్లిపోతుంది. కోలికోడ్‌లో కూడా ఇలానే జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో వర్షం కారణంగా ‘ఆక్వాప్లైనింగ్‌’ అనే పరిస్థితి తలెత్తి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విమాన ప్రమాదాలు సాధారణంగా ఏదో ఒక్క కారణంతోనే చోటు చేసుకోవు. ఇతర కారణాలు ఒక్కసారిగా చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదాలు జరుగుతుంటాయి. కోలికోడ్‌లో జరిగిన ప్రమాదంలో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల కలయిక‌తోనే జరిగి ఉండొచ్చు అంటున్నారు. 

ఓవర్‌ షూట్‌‌ అంటే ఏమిటీ..?  

వందల కిలోమీటర్ల వేగంతో గాల్లో ప్రయాణిస్తున్న విమానం దిగే సమయంలో తొలుత రన్‌వేపై ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం మధ్యలో నేలను తాకాలో ముందుగానే నిర్ణయించి మార్కింగ్‌ చేసి ఉంచుతారు. అక్కడ దిగిన విమానం కొంత దూరం ముందుకు ప్రయాణిస్తూ మెల్లగా వేగాన్ని తగ్గించుకొని.. ఆ తర్వాత ఆగిపోతుంది.  కానీ, విమానం ఈ మార్కింగ్‌ ప్రదేశాన్ని దాటి బాగా ముందుకు వెళ్లిపోయి నేలను తాకితే.. ఆగటానికి అదనపు రన్‌వే అవసరం అవుతుంది. దీనిని ఓవర్‌ షూట్‌‌ అంటారు. వర్షం పడే సమయంలో రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడం వంటి కారణాలతో ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు. కోలికోడ్‌లో వందేభారత్‌ మిషన్‌‌ విమానం నిర్ణీత ప్రదేశాన్ని దాటి కిలోమీటర్‌ ముందుకు వెళ్లి నేలను తాకింది. అక్కడి నుంచి ముందుకు వెళ్లిన విమానం తగినంత అదనపు రన్‌వే అందుబాటులో లేకపోవడంతో లోయలోకి వెళ్లిపోయింది. వాస్తవానికి అక్కడ అదనపు రన్‌వే 200 మీటర్లు ఉండాల్సి ఉంది. కానీ, కేవలం 90 మీటర్లు మాత్రమే ఉంది. దీనికితోడు భారీ వర్షం కారణంగా ‘టెయిల్‌ విండ్‌’ లేదా ‘క్రాస్‌ విండ్‌’ కూడా కారణమై ఉంటాయని భావిస్తున్నారు. 

టెయిల్‌ విండ్‌ అంటే..?

విమానాలు ఎగరడానికి హెడ్‌విండ్‌ (ఎదురు గాలి) ఉపయోగపడుతుంది. అదే విమానం ప్రయాణించే దిశలో వీచే గాలిని టెయిల్‌ విండ్‌ అంటారు. ఈ గాలి వల్ల విమానం వేగం ఒక్కసారిగా పెరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇక క్రాస్‌విండ్‌ అంటే విమానం పక్క నుంచి గాలి వీయడం. ఇది విమాన గమనాన్ని అస్థిరపర్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పైలెట్లు సాధ్యమైనంత వరకు ఈ పరిస్థితిని తప్పించడానికే ప్రయత్నిస్తారు. 

టైర్లపై నియంత్రణ కోల్పోయేదిలా..

రన్‌వేపై విమానం నేలను తాకి సురక్షితంగా ముందుకెళ్లాలంటే టైర్లపై పైలట్లకు నియంత్రణ ఉండాలి. సాధారణంగా భారీ వర్షాలు పడుతున్నప్పుడు రన్‌వేపై నీరు నిలుస్తుంది. అలాంటి ప్రదేశాల్లో విమానం నేలపైకి దిగితే టైర్లకు ఉండే బ్రేకింగ్‌ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. సాధారణంగా నీరు ప్రవహిస్తున్న రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తున్న కారుకు బ్రేకు వేస్తే ఏ విధంగా నియంత్రణ కోల్పోతుందో అటువంటి పరిస్థితే రన్‌వేపై పైలట్లకు ఎదురవుతుంది. దీనిని ‘ఆక్వాప్లైనింగ్‌’ అంటారు. టేబుల్‌ టాప్‌ రన్‌వే, భారీ వర్షం, రన్‌వే సరిగా కనిపించకపోవడం, ఓవర్‌ షూట్‌‌, టెయిల్‌ విండ్‌, ఆక్వాప్లైనింగ్‌ వంటి వాటిల్లో ఏ కొన్ని కలిసినా.. భారీ ప్రమాదం జరిగేందుకు అవకాశలెక్కువ. బ్లాక్‌ బాక్స్‌ను విశ్లేషిస్తే వీటిపై స్పష్టత వస్తుంది. 

2011లోనే ప్రమాద ఘంటికలు..

కోలికోడ్‌ విమానాశ్రయం సురక్షితం కాదని 2011లోనే పౌరవిమానయాన శాఖ నివేదిక సమర్పించింది. ఇక్కడ ఉన్న రెండు రన్‌వేలకు తగినంత సేఫ్టీ ఏరియా లేదని వైమానిక రంగ భద్రతా నిపుణులు మోహన్ రంగనాథన్‌ తెలిపారు. కోలికోడ్‌ విమానాశ్రయంలో అనేక లోపాలను డీజీసీఏ గుర్తించిందని తాజాగా వెల్లడైంది. దీనిపై గత ఏడాది జులై 11న ఈ విమానాశ్రయ డైరెక్టర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని