Updated : 02 Mar 2021 15:22 IST

‘కామెంట్‌ పాండా’ కన్నుపడితే..! 

* పరిశ్రమలను హ్యాక్‌ చేస్తున్న చైనా యూనిట్‌ 61398

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో 12 అంతస్తుల భవనం.. నిత్యం విధులకు హాజరయ్యే వేలాది ఉద్యోగులు.. ఇదే సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌ కాదు. ఇదో ఉన్నత శ్రేణి హ్యాకింగ్‌ బృందం. అమెరికా వంటి దేశాలు కూడా దీనిపేరు చెబితే ఉలిక్కిపడతాయి. ఈ బృందంలో కొన్ని విభాగాలు పూర్తిగా భారత్‌ లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తాజాగా భారత్‌లోని టీకా తయారీ సంస్థల డేటాను దొంగతనం చేసేందుకు కూడా ఇది ప్రయత్నించింది. అదే పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన సైబర్‌ వార్‌ఫేర్‌ విభాగంలోని ‘యూనిట్‌ 61398’. 

అసలేం జరిగింది..?

కొవిడ్‌-19 టీకాలు అభివృద్ధి చేసి, తయారు చేయడమే కాకుండా దేశ, విదేశాలకు సరఫరా చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌తో పాటు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అబాట్‌ ఇండియా, పతంజలి, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వంటి ప్రతిష్ఠాత్మక ఔషధ సంస్థలు, ఆసుపత్రుల ఐటీ వ్యవస్థలే లక్ష్యంగా హ్యాకర్‌ బృందాలు దాడులు చేస్తున్నాయి. టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ సహకారం పొందుతూ సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే సైబర్‌ నిఘా సంస్థ సైఫర్మా తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటీ1 అనే చైనా హ్యాకర్‌ బృందం హస్తం ఈ దాడుల వెనుక ఉందని తేలింది. 

చైనా సైన్యంలో ఏపీటీ 1 ఏమిటీ..?

ఇది చైనా ప్రభుత్వ హ్యాకర్‌ బృందం. చైనాలోని పీఎల్‌ఏ సైబర్‌ విభాగానికి చెందిన యూనిట్‌ 61398గా దీనిని వ్యవహరిస్తారు.  దీనికి కామెంట్‌ క్రూ, కామెంట్‌ పాండా, జిఫ్‌89ఏ, బైజాటియన్‌ కాండోర్‌ అనే పేర్లు ఉన్నాయి. ఈ బృందం హ్యాక్‌ చేయాలనుకునే కంపెనీ వెబ్‌సైట్‌  కామెంట్ల సెక్షన్‌లో ఏదో ఒకటి పోస్టు చేస్తుంది. దానికి సదరు కంపెనీ సిబ్బంది సమాధానం ఇస్తే.. వారి ఐపీ అడ్రస్‌ను గుర్తించి దానిని హ్యాక్‌ చేస్తుంది. అందుకే దీనిని కామెంట్‌ క్రూ అని కూడా అంటారు. 

ఈ భవనం‌ వైపు కన్నెత్తి చూసినా..!

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలోని పుడాంగ్‌ ప్రాంతంలో దీనికి ప్రత్యేకంగా 12 అంతస్తుల భవనాన్ని కేటాయించారు. ఇక్కడ ఏకంగా 1000కి పైగా సర్వర్లు ఉన్నట్లు అమెరికా సైబర్‌ భద్రతా సంస్థలు కనుగొన్నాయి. ఇక్కడ వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికాపై జరిగే సైబర్‌ దాడుల ఐపీ అడ్రస్‌లు మొత్తం ఇదే భవనంలో ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చారు.  కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన మాండియంట్‌ అనే సంస్థ ఈ ‘యూనిట్‌ 61398’ సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపర్చిన 76పేజీల నివేదిక తయారు చేసింది.  చైనా టెలికాం విభాగం ఈ భవనం కోసం ప్రత్యేకంగా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌తో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.  2014లో ఒకసారి అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ బృందం బయట నుంచి ఈ భవనాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించింది. దాని బయట కాపలా ఉన్న చైనా సైనికులు వెంటాడి మరీ సీఎన్‌ఎన్‌ బృందాన్ని పట్టుకొన్నారు. 

పరిశ్రమలే లక్ష్యంగా..

ఈ సంస్థ 20 రకాల పరిశ్రమలే లక్ష్యంగా అత్యధికంగా దాడులు చేస్తుంది. పరిశోధనల బ్లూప్రింట్‌, ఔషధ ఫార్ములాలు, పరిశోధన ఫలితాలు, యంత్రాలు, రక్షణ పరికరాల తయారీ రంగాలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.  ముఖ్యంగా అమెరికాలోని మేధోపరమైన సంపత్తిని దొంగిలించడంలో దీని పాత్ర కీలకం. ముఖ్యంగా ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాల రాజధానులే లక్ష్యంగా ఇది దాడులు చేస్తుంది. 2009లో కోకోకోలా చైనా యువాన్‌ జ్యూస్‌ కంపెనీని 2.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనాలనుకుంది. అదే సమయంలో ఈ హ్యాకింగ్‌ యూనిట్‌ కోకోకోలా కంపెనీ కంప్యూటర్ల నుంచి డీల్‌ వ్యూహాన్ని తస్కరించింది. దీంతో ఆ డీల్‌ ఆగిపోయింది. ఒకే కంపెనీకి చెందిన 6.5టెరా బైట్ల డేటాను ఏడాది కాలంలో అపహరించిందంటే ఇది ఎంత గోప్యంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.  2006 నుంచి 2013 వరకు 141 భారీ సైబర్‌ దాడులు చేసింది. ఇవన్నీ చైనాకు  వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇచ్చేవి.  ఇక మెయిల్స్‌ను హ్యాక్‌ చేయడానికి దీనిలో గెట్‌మెయిల్‌, మాపిగెట్‌ అనే రెండు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. తాజాగా భారత్‌లో పలు రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలపై చైనా నుంచి సైబర్‌ దాడులు జరగడంతో యూనిట్‌ 61398 వార్తల్లో నిలిచింది.  

భారత్‌పై జరిగే సైబర్‌ దాడులకు అత్యధికంగా 35శాతం చైనా భూభాగమే వేదిక అవుతోందని 2018 కంప్యూటర్‌ అత్యయిక ప్రతిస్పందన బృందం నివేదిక బయటపెట్టింది. ఓఎన్‌జీసీ, ఐఆర్‌సీటీసీ, ఎస్‌బీఐ వంటి సంస్థలు హ్యాకర్లకు లక్ష్యంగా మారడం గమనార్హం. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని