Sukesh Chandrasekhar: నెట్‌ఫ్లిక్స్‌లో షో చూసి.. అక్రమ సొమ్మును సక్రమంగా మార్చిన సుకేశ్ దంపతులు..!

మోసగాడు సుకేశ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో ఓ షో చూసి అక్రమ సంపాదనను వైట్‌ మనీగా మార్చినట్లు తేలింది. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.   

Published : 24 Jan 2023 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌(Sukesh Chandrasekhar) దంపతులు పక్కా ప్రణాళికతో వైట్‌ మనీగా మార్చారని ఎకనామిక్‌ అఫెన్సివ్‌ వింగ్‌  ఛార్జిషీట్‌లో పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఒజార్క్‌ ’ అనే షో చూసి అతడు ప్రణాళిక రచించినట్లు దానిలో వెల్లడించింది. ఈ షోలో వలే సుకేశ్‌-లీనా మారియా పౌలోసె జంట కూడా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. సుకేశ్‌(Sukesh Chandrasekhar)కు వచ్చే సొమ్ములో చాలావరకు నల్ల ధనం ఉండటంతో వాటిని చిన్ని వాణిజ్య సంస్థల పేరిట వైట్‌మనీగా మార్చేసినట్లు తెలిపింది.

మనీ లాండరింగ్‌ కోసం లీనా మారియా ‘నెయిల్‌ ఆర్టిస్ట్రీ’ అనే సెలూన్‌ నిర్వహించింది. ఇక్కడ ఆదాయంగా చూపించేందుకు కస్టమర్ల కార్డులను ఇష్టం వచ్చిన మొత్తానికి స్వైప్‌ చేసేవారు. వీరికి అరుణ్‌ మధు, బి.మోహన్‌ రాజ్‌ ఇతరులు కార్డులను సమకూర్చేవారు. సూపర్‌ కార్‌ ఆర్టిస్ట్రీ, ఎల్‌ఎస్‌ ఫ్యాషన్స్‌, న్యూస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరిట మరో మూడు సంస్థలను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు. తన వద్ద ఉన్న అక్రమ సొమ్మును వ్యాపారంలో వచ్చిన ఆదాయం వలే చూపించడానికి ఈ విధంగా చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ సంస్థల బ్యాంక్‌ ఖాతాల స్టేట్‌మెంట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సంస్థలను లీనా మారియనే నిర్వహించింది. ఇక్కడ కార్డులను స్వైప్‌ చేసిన వారికి లానా, సుఖేశ్‌ నగదును సమకూర్చారు. 2020 జూన్‌ నుంచి 2021 ఆగస్టు వరకు ఈ నగదు మార్పిడి కార్యాక్రమం జరిగినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

కేరళకు చెందిన నటి లీనా మారియా పౌల్‌ (మద్రాస్‌ కేఫ్‌ ఫేమ్‌) కు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొన్నాడు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాలాజీ అనే నిర్మాతగా ఆమెను పరిచయం చేసుకొన్నాడు. ఆమెతో చిత్రం నిర్మిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరయ్యాడు. కానీ, అతడి అసలు పేరు సుఖేశ్‌గా తెలిశాక లీనా కొన్నాళ్లు దూరంగా ఉంది. కానీ, ఆ తర్వాత  తిరిగి అతడికి దగ్గరై పెళ్లి చేసుకొంది. ఈ జంట కెనరా బ్యాంక్‌ను మోసం చేసి 12 కోట్ల రూపాయలు దోచుకొన్నట్లు కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని