Towers: 40 అంతస్తులు..4 టన్నుల పేలుడు పదార్థాలు.. 9 సెకెన్లలో భూం...!

మే 22.. 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ ఒక్కపెట్టున కూలనున్నాయి.. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించనున్నారు.. దాదాపు 100 మీటర్ల పొడవైన ఆ భవనాలు కూల్చివేసేందుకు పట్టే సమయం మాత్రం కేవలం 9 క్షణాలే..

Published : 16 Mar 2022 02:17 IST

నొయిడా: మే 22.. 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ ఒక్కపెట్టున కూలనున్నాయి.. అందుకోసం 4 టన్నుల పేలుడు పదార్థాలు వినియోగించనున్నారు.. దాదాపు 100 మీటర్ల పొడవైన ఆ భవనాలు కూల్చివేసేందుకు పట్టే సమయం మాత్రం కేవలం 9 సెకన్లే.. అసలు అంత పెద్ద నిర్మాణాలను ఎందుకు కూల్చివేయాల్సి వస్తుందో తెలుసుకోవాలంటే.. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే..!

ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలో నొయిడాలో సెక్టార్‌ 93 ప్రాంతంలో సూపర్ టెక్‌ లిమిటెడ్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణం విషయంలో రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డరు పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించలేదు. దీనిపై స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు.. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్‌టెక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు 40 అంతస్తుల ట్విటర్ టవర్స్‌ కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. వీటిని కూల్చివేసేందుకు మే 22న మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం ఫిక్స్ చేశారు. స్థానిక అధికారులు ఆ బాధ్యతను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ చేతిలో పెట్టారు. అలాగే ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు 2,500 నుంచి 4,000 కిలోల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచనా. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు.

ముందుగా ట్రయల్‌ బ్లాస్ట్‌..

ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..‘పేలుడు ప్రారంభం కాగానే ఆ టవర్స్‌ వివిధ దశల్లో అంతస్తుల వారీగా లోపలికి పడిపోతాయి. 10 స్థాయులు ప్రైమరీ బ్లాస్ట్ ఫ్లోర్‌లుగా, ఏడు స్థాయులు సెకండరీ బ్లాస్ట్ ఫ్లోర్‌లుగా పనిచేస్తాయి. ప్రైమరీ బ్లాస్ట్‌ ఫ్లోర్‌లలో అన్ని నిలువు వరుసల్లో పేలుడు పదార్థాలు ఉంటాయి. సెకండరీ బ్లాస్ట్‌ ఫ్లోర్‌లలో 40 శాతం నిలువు వరుసల్లోనే పేలుడు పదార్థాలుంటాయి’ అంటూ ఆ ప్రక్రియను వివరించింది. అలాగే మార్చి చివరి వారం లేక ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్‌ బ్లాస్ట్ జరగనుంది. మొత్తంగా దీనికోసం ఇప్పటికే ముందస్తు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అంతస్తుల్లో అమర్చిన తలుపులు, కిటకీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు తదితరాలను తొలగిస్తున్నారు. అలాగే ఈ పేలుడు వల్ల ఏర్పడే శిథిలాలను తగ్గించేందుకు గోడల్ని కూడా కూల్చివేయనున్నారు. ఒకవేళ శిథిలాలు విసిరినట్లు పడినా.. ఎలాంటి ప్రమాదం జరకుండా ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూల్చివేత వల్ల కలిగే ప్రకంపనలు తగ్గించేందుకు నేలపై కుషన్లు అమర్చనున్నారు. 

ఇక ట్విన్ టవర్స్‌కు దగ్గర్లో వందల సంఖ్యలో కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇతర భవనాలకు ఎలాంటి హాని జరగదని నిపుణులు హామీ ఇచ్చారని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. బీమా సౌకర్యం అందుబాటులో ఉందని నొయిడా అథారిటీ అధికారులు తెలిపారు. అలాగే ఈ ప్రక్రియ కోసం ఒక ఎక్స్‌క్లూజన్‌ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ క్రమంలో కొన్నిగంటలపాటు ఎవరినీ ఆ జోన్‌లోకి రానివ్వరు. అలాగే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. ‘పేలుడు సమయంలో ఇద్దరు విదేశీ నిపుణులు, ఒక పోలీసు అధికారి, ఒక బ్లాస్టర్‌, ఎడిఫైస్ ప్రాజెక్టు మేనేజర్ మాత్రమే జోన్‌ లోపల ఉంటారు’ అని సంస్థ పేర్కొంది. కాగా, ఈ ఎడిఫైస్ సంస్థ 2019లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్‌ లిస్బన్ టవర్‌ను కూల్చివేసింది. అది దక్షిణాఫ్రికాలోని జోహనెస్‌బర్గ్‌లో ఉండేది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని