సూదితో ప్రపంచాన్ని గెలుస్తున్నాం..!

కరోనావైరస్‌ పోరాటంలో భారత్‌ది ప్రత్యేకం స్థానం. కరోనా ఔషధమైన రెమిడెస్‌వీర్‌ను అమెరికాలో కనుగొన్న వారు మనంత భారీగా స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయారు.

Updated : 21 Mar 2021 12:57 IST

 ప్రపంచ దేశాలకు భారత్‌ అండ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనావైరస్‌ పోరాటంలో భారత్‌ది ప్రత్యేకం స్థానం. కరోనా ఔషధమైన రెమిడెస్‌వీర్‌ను అమెరికాలో కనుగొన్న వారు మనంత భారీగా స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోయారు. ఇక టీకాల విషయానికి వస్తే 70 దేశాలకు 5.8 కోట్ల టీకాలను ఎగుమతి చేశాం. టీకాలను ఎగుమతి చేసినంత మాత్రాన వాటిని ప్రజలకు అందించలేరు. వాటిని వాడేందుకు అవసరమైన సిరంజీల ఉత్పత్తిలో కూడా భారత్‌కు చెందిన ఓ కంపెనీ అత్యంత  కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ టీకాలు వేసేందుకు అవసరమైన సిరంజీల్ని భారీ స్థాయిలో ఈ కంపెనీ తయారు చేస్తోంది. అదే ఫరీదాబాద్‌లోని ‘హిందూస్థాన్‌ సిరంజీస్‌ అండ్‌ మెడికల్ డివైజస్‌ (హెచ్‌ఎండీ)’. ‘డిస్పోవాన్‌’ పేరుతో ఈ సంస్థ సిరంజీలను విక్రయిస్తుంది. ఓ పక్క చైనాలో తయారయ్యే వీటి ధరలు దాదాపు 40శాతం వరకు పెరగడంతో అగ్రదేశాల నుంచి చిన్న దేశాల వరకు భారత్‌ వైపు చూస్తున్నాయి. ఈ కంపెనీకి నిత్యం సిరంజీల కోసం 40దేశాల నుంచి ఈమెయిల్స్‌ వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.

భారీగా డిమాండ్‌..

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాల్లో పలు రకాల వ్యాక్సిన్ల వినియోగానికి ఆయా దేశాలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాయి. వీటిల్లో నిత్యం 8 మిలియిన్లకు పైగా డోసులను ప్రజలకు వేస్తున్నారు. టీకాలను బట్టి సిరంజీల వినియోగం ఉంటుంది. చాలా దేశాలు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకా వినియోగానికి అవసరమయ్యే సిరంజీలకు భారీగా డిమాండ్‌ పుట్టుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 60శాతం మంది ప్రజలకు టీకాలు వేయాలంటే 800 నుంచి 1000 కోట్ల సిరంజీల అవసరం ఉంటుంది. దీంతో భారత్‌కు చెందిన హెచ్‌ఎండీ సంస్థకు అమెరికా, జర్మనీ,ఇటలీ, స్పెయిన్‌, బ్రెజిల్‌ వంటి దేశాల నుంచి 40 వరకు ఈమెయిల్స్‌ వస్తున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ రాజీవ్‌ నాథ్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు పాత క్లయింట్లకు మాత్రమే ఇబ్బంది రాకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం భారీగా స్టాక్‌ను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. అవి ఈ ఏడాది మధ్య వరకు సరిపోతాయని ఆయన వివరించారు.

ఉత్పత్తిలో 40శాతం పెంపు..

ఇతర దేశాలకు సాయం చేసేలా కొత్త ఆర్డర్లు పూర్తి చేసేందుకు.. ఉత్పత్తిని 40శాతం పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నిమిషానికి 5,900 సిరంజీలను తయారు చేస్తుండగా.. దానిని 8,200కు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ కంపెనీ తన పూర్తి సామర్థ్యంలో 80శాతం మేరకు 250 కోట్ల సిరంజీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సారి మాత్రం ఏటా 270 కోట్ల సిరంజీలను ఉత్పత్త చేసేలా పనిచేస్తోంది. ఈ సామర్థ్యాన్ని జులై నాటికి 300 కోట్లకు చేర్చనున్నారు.  ఐరాస కోవాక్స్‌ కార్యక్రమానికి 14 కోట్ల సిరంజీలను సరఫరా చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సెప్టెంబర్‌ నాటికి 26.5 కోట్లను సరఫరా చేయాల్సి ఉంది. ఈ కంపెనీలో తయారయ్యే వాటిలో మూడింట రెండోంతులు భారత్‌ అవసరాలు తీర్చేందుకు.. మరో వంతు ప్రపంచ దేశాలకు సరఫరా చేయనున్నారు.

సొంత రిస్క్‌తో పెట్టుబడి..

టీకాకు ఉపయోగించే ప్రత్యేకమైన సిరంజీని ఒక్కోదానిని రూ.2కు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్న పని. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాజమాన్యం గతేడాది కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలను సంప్రదించి ముందస్తుగా కొన్ని ఆర్డర్లు ఇవ్వమని కోరింది. అప్పుడు తాము నమ్మకంగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని పెంచవచ్చని భావించింది. కానీ, ఎవరూ దానిని సీరియస్‌గా తీసుకోలేదు.. స్పందించలేదు.  కొవిడ్‌ ఉపశమించినా.. లేక ప్రజలు టీకాలు తీసుకోవడం ఆపేసినా వీటి విక్రయాలు భారీగా పడిపోతాయి. ప్రస్తుతం అత్యవసర సమయంలో ఉత్పత్తిని పెంచిన మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల పరిస్థితి ఇదే. ఇలాంటి రిస్క్‌ ఉన్నా..  కంపెనీనే గత మే నుంచి రూ.100  కోట్ల పెట్టుబడి పెట్టింది. పొరబాటున ఈ కంపెనీ అంచనాలు తప్పితే  పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికే ఎనిమిదేళ్ల  వరకు పట్టొచ్చు. కానీ, ఆ పెట్టుబడి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది. ఇటీవలే బ్రెజిల్‌ ఇక్కడి నుంచి భారీగా సిరంజీలు కొనుగోలు చేసింది. వీటి ధర కంటే రవాణాకు ఐదు రెట్లు అధికంగా ఖర్చయినా వెనకాడకుండా కొనుగోలు చేసిందంటే డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు.

టీకా వృథాను తగ్గించేందుకు వైల్స్‌లో ఉండే కొద్ది మొత్తాన్ని సేకరించి అదనపు డోసులు చేస్తున్నారు. వీటికి సరైన సైజు ఉన్న సిరంజీలు వాడకపోతే మిలియన్ల కొద్దీ డోసులు వృథా అవుతాయి. ఇలాంటి పరిస్థితి జపాన్‌లో తలెత్తింది. ఫైజర్‌ వంటి టీకా వైయల్స్‌ నుంచి అదనపు డోసును సేకరించేందుకు 0.3ఎంల్‌, ఆటో డిసేబుల్‌, 1 ఎంల్‌ ఎక్కువగా వాడుతున్నారు.

కొవిడ్‌ లేని రోజుల్లో భారత్‌ రూ.200 కోట్ల విలువైన సిరంజీలను ఎగుమతి చేస్తుంది.. అదే సమయంలో చైనా నుంచి రూ.400 కోట్లు విలువైనవి దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అమెరికా, చైనాలు అత్యధికంగా సిరంజీలను తయారు చేస్తాయి. కానీ, కొవిడ్‌ కారణంగా ముడి సరుకుల కొరతతో చైనా ధరలను 40శాతం వరకు పెంచింది. ఇక అమెరికా దేశీయ అవసరాలకు కూడా సిరంజీలు సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో ‘‘భారత్‌ మరోసారి ప్రపంచ దేశాలకు ఆశాకిరణంగా మారింది. సంకట సమయంలో లాభం చూసుకోకుండా.. గతంలో హెచ్‌సీ‌క్యూ, ఉచితంగా టీకాలను సరఫరా చేశాం. ఇప్పుడు సిరంజీల కొరతను తీరుస్తున్నాం’’ అని  హెచ్‌ఎండీ కంపెనీ ఎండీ రాజీవ్‌ నాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని