పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్‌ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!

ఒడిశా రైలు దుర్ఘటన జరిగిన బాలేశ్వర్ సమీపంలో రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో అక్కడి పట్టాలపై రైలు ప్రయాణిస్తోన్న సమయంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw) చేతులు జోడించి నమస్కరించారు.   

Updated : 05 Jun 2023 12:11 IST

బాలేశ్వర్‌: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించగా.. మరోపక్క బోగీలు, పట్టాలు ధ్వంసమయ్యాయి. దాంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రైల్వేశాఖ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. 

నిన్న రాత్రి బాలేశ్వర్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఓ రైలు ప్రయాణించింది. బొగ్గును తీసుకెళ్తోన్న ఆ రైలు రూర్కెలా(ఒడిశా)వైపు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) కూడా ఉన్నారు. ఆ ప్రక్రియను పర్యవేక్షించారు. అప్పటికే రైలు ప్రమాదంతో చలించిపోయిన మంత్రి.. గూడ్స్‌ రైలు ప్రయాణిస్తోన్న సమయంలో ప్రార్థన చేశారు. చేతులు జోడించి నమస్కరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల్వే శాఖ పట్టాలను రాకపోకలకు సిద్ధం చేసింది. సోమవారం ఉదయం ఆ పట్టాలపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Howrah - Puri Vande Bharat Express ) కూడా ప్రయాణించింది. అక్కడ రైళ్లు తమ వేగాన్ని నియంత్రించుకొని, కొంతదూరం నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు.

మోదీ కాగ్ నివేదికను విస్మరించారు: ఎన్‌సీపీ

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్ల గత తొమ్మిదేళ్లలో భారీగా రైలు ప్రమాదాలు జరిగాయని ఎన్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రధాని కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. రైలు భద్రతను పూర్తిగా విస్మరించారు. దానివల్లే తాజా ఘటనలో వందల మరణాలు సంభవించాయి. కాగ్ నివేదిక ముందుగానే పలు లోపాలను లేవనెత్తగా.. భాజపా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ప్రమాదం తప్పేదే. దీనిపై నైతిక బాధ్యత వహిస్తూ,రైల్వే మంత్రి రాజీనామా చేయాలి’ అని ఎన్‌సీపీ ప్రతినిధి మహేశ్ తాపసే ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని