Delhi Airport: ఒమిక్రాన్‌ కట్టడికా? ఆహ్వానానికా?.. రైల్వేస్టేషన్‌ను తలపించిన దిల్లీ ఎయిర్‌పోర్టు

ఈ ఫొటో చూసి.. పండగల వేళ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న జనాలతో కిక్కిరిసిపోయిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ అనుకుంటున్నారా..! కానేకాదు, దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ

Published : 07 Dec 2021 02:17 IST

దిల్లీ: ఈ ఫొటో చూసి.. పండగల వేళ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న జనాలతో కిక్కిరిసిపోయిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ అనుకుంటున్నారా..! కానేకాదు, దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఒమిక్రాన్‌ భయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. ఫలితంగా కరోనా నిబంధనలు గాలికొదిలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. 

దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోన్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో పరీక్షలు చేయించుకుని ఫలితం తెలుసుకునే వరకు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. 

దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులకు అక్కడి అధికారులు రెండు అవకాశాలు కల్పించారు. ఒకటి.. సాధారణ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష. దీనికి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ పరీక్ష ఫలితం రావాలంటే ప్రయాణికులు 6-8 గంటలు ఎదురుచూడాల్సి వస్తుంది. ఇక రెండోది.. ర్యాపిడ్‌ పీసీఆర్‌ టెస్ట్‌. దీని ధర రూ.3,500. రెండు గంటల్లో ఫలితం వస్తుంది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితానికి చాలా సేపు పడుతుండటంతో ఖర్చు ఎక్కువైనా ప్రయాణికులు ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే దీని ఫలితం కోసం కూడా రెండు గంటల సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ డెస్కుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక, పరీక్షల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదివారం నాటి దృశ్యాలను కొందరు ఫొటోలు తీసి సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కరోనా నిబంధనలు పక్కనబెడితే.. ఈ పరిస్థితులతో ఎయిర్‌పోర్టులే హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ప్రయాణికులు కనీస నిబంధనలైన మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించకపోవడం కలవరపెడుతోంది. ఈ నిబంధనలు ఒమిక్రాన్‌ కట్టడికా? ఆహ్వానానికా? అన్నట్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రయాణికులకు వైరస్‌ పరీక్షల కోసం దిల్లీ ఎయిర్‌పోర్టులో కొత్తగా 20 కౌంటర్లను తెరిచినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని