Kiccha Sudeep: రాజకీయాల్లో చేరట్లేదు.. ఆ లేఖ ఎవరు పంపారో నాకు తెలుసు: సుదీప్‌

భాజపాలో చేరబోతున్నారంటూ వచ్చిన ఊహాగానాలపై కన్నడ స్టార్‌ సుదీప్‌ (Kiccha Sudeep) క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో చేరడంలేదని.. ఎక్కడా పోటీ చేయడంలేదని స్పష్టంచేశారు.

Updated : 05 Apr 2023 21:51 IST

బెంగళూరు: కన్నడ స్టార్‌ సుదీప్‌(Kiccha Sudeep) భాజపాలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో చేరడంలేదని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బాజపా తరఫున ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారం బెంగళూరులో సీఎం బసవరాజ్‌ బొమ్మైతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఈ సందర్భంగా సుదీప్‌ స్పష్టంచేశారు.  కష్ట సమయంలో తనకు సీఎం బొమ్మై అండగా నిలిచారని.. ఇప్పుడు తాను ఆయనకు మద్దతుగా నిలబడతానన్నారు. భాజపా తరఫున ప్రచారం చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ నుంచీ తాను పోటీ చేయడంలేదన్నారు. 

సీఎం నాకు ‘గాడ్‌ఫాదర్‌.. ’లాంటి వారు!

సీఎం బొమ్మైతో భేటీ అనంతరం ఇద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం బొమ్మై కు తన మద్దతు ప్రకటించేందుకు వచ్చానన్న సుదీప్‌.. సీఎం తన గాడ్‌ ఫాదర్‌లాంటివారన్నారు. బొమ్మైను తాను ప్రేమతో, గౌరవంగా ‘మామా’ అని పిలుచుకుంటానని.. క్లిష్ట సమయంలో ఆయన తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు. బొమ్మైకి మద్దతు ఇస్తున్నానంటే దానర్థం ఆయన సూచించిన వారందరికీ అన్నారు. 

అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ.. సుదీప్‌ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదన్నారు. తనకు, తన పార్టీకి మద్దతు ప్రకటించేందుకే ఆయన తనను కలిసేందుకు వచ్చారన్నారు.  భాజపాలో చేరతారన్న ఊహాగానాల నడుమ తనకు వచ్చిన బెదిరింపు లేఖ అంశంపైనా స్పందించిన సుదీప్‌.. ఆ లేఖ ఎవరు పంపారో తనకు తెలుసని.. తగినరీతిలో బదులిస్తానన్నారు. అలాగే, భాజపా సిద్ధాంతాలతో మీరు ఏకీభవిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిన నటుడు.. ప్రధాని మోదీ తీసుకున్న కొన్నినిర్ణయాలను తాను పూర్తిగా గౌరవిస్తానన్నారు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి దాంతో సంబంధంలేదన్నారు.

మరోవైపు, కర్ణాటక (Karnataka)అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) ఇటీవల షెడ్యూల్‌ విడులైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్‌ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్‌ 20 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని