CV Ananda Bose: రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు: బెంగాల్‌ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదని, ప్రస్తుతం విధుల్లో ఉన్న కోల్‌కతా పోలీసు సిబ్బందితో తనకు ముప్పు ఉందని బెంగాల్‌ గవర్నర్‌ వ్యాఖ్యలు చేశారు. 

Updated : 20 Jun 2024 19:05 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌- రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ (CV Ananda Bose) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి అధికారి, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. అలా అనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే నేను సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చాను. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు’’ అని బోస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. తన అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల వారు అలా చేస్తున్నారని గవర్నర్ భావిస్తున్నారు.

ఇదిలాఉంటే.. రెండురోజుల క్రితం రాజ్‌భవన్‌ పోలీసులపై గవర్నర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. వారు తక్షణమే అధికారిక నివాస పరిసరాలను విడిచివెళ్లిపోవాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన దాడుల బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన అసెంబ్లీలో విపక్ష(భాజపా) నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై సువేందు కలకత్తా హైకోర్టుకు వెళ్లగా, అనుమతి ఉంటే గవర్నర్‌ను కలిసేందుకు వారిని రాజ్‌భవన్‌ లోపలికి పంపాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారం తర్వాత పోలీసుల తీరుపై గవర్నర్‌ తీవ్రంగా మండిపడ్డారు. తన ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని