Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!

తాను భాజపాకు చెందిన నేతనే.. అయినప్పటికీ, ఆ పార్టీ మాత్రం తనది కాదని మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) వ్యాఖ్యానించారు.

Published : 02 Jun 2023 01:44 IST

ముంబయి: తాను భాజపాకు చెందిన నేతనే.. అయినప్పటికీ, ఆ పార్టీ మాత్రం తనది కాదని మహారాష్ట్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) వ్యాఖ్యానించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. భాజపా (BJP) ఎంతో పెద్ద పార్టీ అని పేర్కొన్నారు. కొంతకాలంగా భాజపా రాష్ట్ర (Maharashtra) నాయకత్వం ఆమెను దూరం పెడుతోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. పంకజా ముండే వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

‘నేను భాజపాకు చెందిన వ్యక్తినే. ఒకవేళ నా తండ్రితో ఏదైనా సమస్య ఉంటే.. నా సోదరుడి ఇంటికి వెళ్లేదాన్ని’ అని పేర్కొన్నారు. గోపీనాథ్‌ ముండేకు సన్నిహితుడైన మహదేవ్‌ జాన్‌కర్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్‌ పక్ష (RSP) పార్టీని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహదేవ్‌ మాట్లాడుతూ.. ‘మా సోదరి పార్టీతో మన వర్గానికి ఎటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే, ఆ పార్టీ రిమోట్‌ కంట్రోల్‌ వేరే వాళ్ల చేతిలో ఉంటుంది’ అని పేర్కొన్నారు.

భాజపా సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండే ( Gopinath Munde) కుమార్తెనే పంకజా ముండే. 2014-19లో దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె మంత్రిగా పనిచేశారు. అయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సమీప బంధువు, ఎన్‌సీపీ నేత ధనంజయ్‌ ముండే చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం అనేక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు.

అయితే, కొంతకాలంగా రాష్ట్ర భాజపా ఆమెను పక్కకు పెట్టిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2022 ఆగస్టులో ఏక్‌నాథ్‌ శిందే తొలి కేబినెట్‌ విస్తరణ సమయంలో మాట్లాడిన ఆమె.. తనకు బెర్త్‌ లభించకపోవచ్చని ముందుగానే ఊహించారు. అయితే.. పార్టీకి, ముండేకు మధ్య చీలిక తెచ్చేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని భాజపా మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ భావంకులే గతంలో పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని