Uddhav Thackeray: సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సమర్థించను: ఉద్ధవ్‌

వీడీ సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు.

Updated : 17 Nov 2022 14:56 IST

ముంబయి: వీడీ సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు. అదే సమయంలో భాజపాపైనా విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. సావర్కర్‌ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారని పేర్కొన్నారు. బ్రిటీషర్ల నుంచి పింఛన్‌ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారంటూ రాహుల్‌ విమర్శలు గుప్పించారు. దీనిపై భాజపా మండిపడింది. చరిత్రను రాహుల్‌ గాంధీ వక్రీకరిస్తున్నారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ తప్పుబట్టారు. అలాంటి వ్యక్తితో కలిసి కొందరు యాత్రల్లో పాల్గొంటున్నారని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాల్‌ థాక్రే ఆశయాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

ఈ వ్యవహారంపై ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. రాహుల్‌ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సావర్కర్‌పై ఆయన వ్యాఖ్యలను అంగీకరించబోనని చెప్పారు. సావర్కర్‌ అంటే తమకు ఎనలేని అభిమానం ఉందని, అది ఎన్నటికీ చెదిరిపోదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భాజపా విమర్శలనూ తిప్పికొట్టారు. తమను విమర్శించే ముందు.. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలిసి అధికారం పంచుకున్నారో సమాధానం చెప్పాలని భాజపాను డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలో మొన్నటి వరకు కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని నడిపిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల భారత్‌ జోడో యాత్రలో ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు.

వ్యాఖ్యలను సమర్థించుకున్న రాహుల్‌

సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగిన వేళ రాహుల్‌ గాంధీ స్పందించారు. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ మేరకు సావర్కర్‌ రాసిన క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. మహాత్మ గాంధీ, నెహ్రూ, పటేల్‌ వంటి వారూ పలుమార్లు జైలుకు వెళ్లి, ఏళ్ల పాటు శిక్ష అనుభవించినా.. వారెప్పుడూ ఈ తరహా లేఖలు రాయలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని