Infosys: దిల్లీ రావాలంటే ఇబ్బందిగా ఉంది: నారాయణమూర్తి

దిల్లీ రావాలంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (NarayanaMurthy) అన్నారు. ఇక్కడ ట్రాఫిక్‌ నిబంధనలెవరూ పాటించరని, ప్రభుత్వ ఆస్తుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని అన్నారు.

Published : 22 Feb 2023 01:52 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ట్రాఫిక్‌ నిబంధనలను ఎవరూ పట్టించుకోరని, అందుకే ఇక్కడికి రావాలంటే తనకు అసౌకర్యంగా ఉంటుందని ఇన్ఫోసిన్‌ (Infosys)వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (NarayanaMurthy) అన్నారు. దిల్లీలో నిర్వహించిన ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ దిల్లీలో ఎవరూ ట్రాఫిక్‌ నిబంధనలు సరిగా పాటించరు. అందుకే ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.నిన్న నేను విమానాశ్రయంలో దిగి కారులో హోటల్‌కు వెళ్తున్నాను. మధ్యలో ఎన్నో రెడ్‌ సిగ్నల్స్‌ పడ్డాయి. కానీ, ఎవరూ వాహనాలు ఆపడం లేదు.అలాగే ముందుకెళ్లిపోతున్నారు.’’ అని  నారాయణమూర్తి అన్నారు.ఒకట్రెండు నిమిషాలు కూడా ఆగకపోతే ఎలా?అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కనీసం అక్కడ డబ్బులు వేస్తే అప్పుడైనా ఆగుతారేమోనని వ్యాఖ్యానించారు.

చిన్నప్పుడే నేర్పించాలి

కార్పొరేట్‌ ప్రపంచంలో సరైన విలువలు సృష్టించడంపై నారాయణ మూర్తి మాట్లాడుతూ.. సమాజంలో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలని అన్నారు. అప్పుడే పిల్లలు సరైన మార్గంలో పయనించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడే పిల్లలు అనవసరమైన ఉద్రిక్తతలకు లోనుకాకుండా ఉంటారని చెప్పిన ఆయన..కార్పొరేట్‌ పాలన గురించి పాఠశాల వయస్సులోనే తాను నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజా ఆస్తులను వ్యక్తిగత ఆస్తులకంటే బాధ్యతగా చూడాలి. ఈ నియమాన్ని నిజాయితీగా పాటించక పోయినందువల్లే..ప్రభుత్వ ఆస్తులపట్ల చిన్నచూపు, రోడ్డుపై ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని నారాయణమూర్తి తెలిపారు.

మంచి వ్యక్తిగా గుర్తింపు వద్దు

మంచి వ్యక్తిగా కాకుండా.. నిజాయితీపరుడిగా ఉండేందుకే తాను ఇష్టపడుతున్నట్లు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ‘‘ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక వేళ మీరు మంచి వ్యక్తి అయితే.. ఎవరైనా మీ వస్తువును దొంగలించినా, మీరు నవ్వుతూ ఉంటారు.  కానీ, నేను అందుకు ఇష్టపడను. అందుకే నేను నిజాయితీపరుడిగా పేరు పొందాలనుకుంటున్నాను. ఎవరైనా తప్పు చేస్తే ఎదిరించి చెప్పగలగాలి. మన దగ్గర సరైన విషయం ఉంటే అవతలి వాళ్లు ఓడిపోయినా, మనల్ని గౌరవిస్తారు, మనం చేసే పని నిక్కచ్చిగా ఉంటే.. వాళ్లు కూడా మద్దతిస్తారు’’ అని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

చాట్‌జీపీటీ వంటి సాంకేతిక సాధనాలతో భవిష్యత్‌లో మరిన్ని మార్పులు రాబోతున్నాయని నారాయణమూర్తి అన్నారు. ప్రకృతి రహస్యాలను సైన్స్‌ బహిర్గతం చేస్తే.. సాంకేతికత అనేది మాన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడంతోపాట, ఖర్చును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మానవులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటారనీ, అయితే అది అబద్ధమని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ ఎప్పటికీ మానవులను అధిగమించలేదని అన్నారు. మానవులకు ఆలోచించగలిగే శక్తి ఉందని చెప్పిన ఆయన.. ఇప్పటి వరకు కంప్యూటర్లకు ఆ శక్తి లేదని అన్నారు. దీనిపై ఇప్పటికే అనేక ప్రయోగాలు జరిగినట్లు గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని