MK Stalin: ఆ సమయంలో పోలీసు భద్రతతో కాలేజీకి వచ్చి పరీక్షలు రాశా: సీఎం స్టాలిన్‌

విద్యే నిజమైన సంపదని.. దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M K Stalin) అన్నారు. యువత బాగా చదువుకుని తమ జీవితాలను .....

Updated : 05 Jul 2022 20:16 IST

కాలేజీ డేస్‌ని గుర్తుచేసుకున్న తమిళనాడు సీఎం 

చెన్నై: విద్యే నిజమైన సంపదని.. దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M K Stalin) అన్నారు. యువత బాగా చదువుకుని తమ జీవితాలను సుసంపన్నంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తన కాలేజీ రోజులతో పోలిస్తే విద్యారంగంలో గొప్ప మార్పులు వచ్చాయన్నారు. విద్యారంగంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. మంగళవారం ఆయన ప్రతిష్ఠాత్మక ప్రెసిడెన్సీ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేసిన అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగిస్తూ తన కాలేజ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు మీ అందరినీ అభినందించి మాట్లాడటానికి ఓ ముఖ్యమంత్రిగానే కాదు.. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ పూర్వ విద్యార్థిగా ఇక్కడికి వచ్చా. ఈ విద్యా సంస్థ మద్రాస్‌ యూనివర్సిటీ ఉనికిలోకి రావడానికి 17 ఏళ్ల ముందే ప్రారంభమైంది. అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో 1840లో స్థాపించిన మొట్టమొదటి, అగ్రశ్రేణి కళాశాల ఇది. 17 ఏళ్ల తర్వాత అంటే 1857లో ప్రారంభమైన మద్రాస్‌ యూనివర్సిటీకి మాతృసంస్థగా పేర్కొనే ఈ ప్రతిష్ఠాత్మక కళాశాల నుంచే సర్‌ పిట్టి తీగరాయ, యు.వి స్వామినాథ అయ్యర్‌‌, సీవీ రామన్‌, రాజాజీ వంటి ప్రముఖుల్ని వచ్చారు’’ అని కళాశాల గొప్పతనాన్ని స్టాలిన్‌ వివరించారు. 

అందుకే నా చదువు కొనసాగించలేకపోయా..

1972 జూన్‌ 15న ప్రెసిడెన్సీ కళాశాలలో తాను పొలిటికల్‌ సైన్స్‌ కోర్సులో చేరినప్పటికీ డీఎంకే తరఫున ప్రచారం చేసే బాధ్యతను తనపై వేయడంతో రాజకీయంగా ఎక్కువగా ప్రభావితమైనట్టు స్టాలిన్‌ తెలిపారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో మిసా చట్టం (మెయింటీనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ -MISA) కింద తనను నిర్బంధించడంతో చదువును కొనసాగించలేకపోయినట్టు తెలిపారు. మిసా చట్టం కింద తనతో పాటు 500 మంది డీఎంకే సభ్యులను నిర్బంధించారని.. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన  డీఎంకే సర్కార్‌ను సైతం రద్దు చేశారంటూ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తనను నిర్బంధించిన సమయంలో పోలీసుల భద్రతతో కళాశాలకు వచ్చి పరీక్షలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా స్టాలిన్‌ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం విద్యారంగంలో ఎంతో మెరుగైన పరిస్థితులు వచ్చాయన్నారు. మౌలికవసతులు మెరుగుపరడం ద్వారా ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రెసిడెన్సీ కళాశాలలో 2వేల మంది కూర్చొనేలా మాజీ సీఎం కరుణానిధి పేరిట మెగా ఆడిటోరియాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, 300 మందికి పైగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల చదువు కోసం ఓ వసతి గృహాన్ని కూడా నిర్మిస్తామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని