
Amit Shah: గుజరాతీ కంటే హిందీ భాషనే ప్రేమిస్తా
వారణాసి అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళనంలో అమిత్ షా
వారణాసి: గుజరాతీ కంటే హిందీ భాషనే ప్రేమిస్తానని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. శనివారం ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో నిర్వహించిన అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘భారతీయులందరూ రాజ్‌భాష (అధికార భాష)ని బలోపేతం చేసుకోవాలి. తల్లిదండ్రులందరూ మీ పిల్లలతో మాతృభాషల్లోనే మాట్లాడండి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన మాతృభాష మనకు గర్వకారణం. కేంద్ర హోంశాఖలో ఒక్క ఫైల్ కూడా ఇంగ్లీష్‌లో రాయడం, చదవడం చేయడం లేదు. ఇది చెప్పడానికి గర్వంగా ఉంది. అనేక శాఖలు కూడా ఇదే దిశగా కొనసాగుతున్నాయి. పరిపాలనా భాష.. స్వభాష, అధికార భాష అయినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రజల ఉద్యమంగా మార్చారు. దానికి మూడు స్తంభాలు ఉన్నాయి స్వరాజ్, స్వదేశీ,స్వభాష. అందులో స్వరాజ్యాన్ని సాధించాం కానీ స్వదేశీ స్వభాష మాత్రం వెనుకబడిపోయాయి. హిందీ భాష, స్థానిక భాషల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీకి కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది’’ అన్నారు. ప్రాంతీయ భాషల్లో కాకుండా విదేశీ భాషల్లో పరిశోధనలు జరగడం వల్లే దేశం వెనుకబడిపోయిందన్న అమిత్ షా దీని గురించి వివరిస్తూ ‘‘ నూతన జాతీయ విద్యా విధానం ప్రాంతీయ భాషపై దృష్టి పెడుతుంది. అలాగే, ప్రతి రాష్ట్ర చరిత్రను అధికారిక భాషలోకి అనువదించాలి’’ అన్నారు.