Rahul Gandhi: మోదీ కళ్లల్లో నాకు భయం కన్పించింది: రాహుల్‌ గాంధీ

‘‘నేను నిజాన్నే నమ్ముతా. దాన్నే మాట్లాడుతా. ఈ అనర్హతలు నన్నేం చేయలేవు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నా పోరాటం ఆగదు. జైల్లో పెట్టినా వెనకడుగు వేయను. నా పేరు గాంధీ. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు’’ - మీడియా సమావేశంలో రాహుల్‌ గాంధీ

Updated : 25 Mar 2023 14:03 IST

దిల్లీ: అదానీ (Adani Row)పై ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేసిందన్నారు కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi). ఈ విషయంపై నేడు ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన ఆయన మోదీ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. అదానీ గురించి అడిగినప్పుడు ప్రధాని మోదీ (PM Narendra Modi) కళ్లల్లో భయాన్ని చూశానని అన్నారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టినా.. మోదీకి ప్రశ్నలు వేస్తూనే ఉంటానని తెలిపారు. (Rahul Gandhi Press Meet)

క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు..

‘‘మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని నేను చాలా సార్లు చెప్పాను. అందుకు ఉదాహరణలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అదానీ వ్యవహారంపై ప్రశ్నించినందుకు నాకేం జరిగిందో ప్రజలంతా చూశారు. సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నా ప్రసంగాన్ని తొలగించారు. బ్రిటన్‌లో నేను అనని మాటలను అన్నట్లు చూపించారు. సాక్షాత్తు కేంద్రమంత్రే పార్లమెంట్‌లో అసత్యాలు వల్లించారు. ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారు. అయినా నేను ప్రశ్నించడం ఆపను. ఈ దేశం నాకు ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇచ్చింది. అందుకే ఈ దేశ ప్రజల కోసం నేనేమైనా చేయడానికి వెనుకాడను. నిజం మాట్లాడటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేసేదే లేదు. నా పేరు సావర్కర్‌ కాదు.. గాంధీ..! క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది’’ అని రాహుల్‌ (Rahul Gandhi) స్పష్టం చేశారు.

అదానీకి మోదీ మద్దతు ఎందుకు..?

‘‘అదానీ (Adani Row) వ్యవహారంపై నేను స్పీకర్‌కు అన్ని ఆధారాలతో రెండు లేఖలు రాశాను. అయినా సమాధానం రాలేదు. దీని గురించి స్పీకర్‌ ఛాంబర్‌కు వెళ్లి మరీ అడిగాను. ఆయన ఓ నవ్వు నవ్వి.. తానేం చేయలేనని చెప్పి.. ఛాయ్‌కి ఆహ్వానించారు. అదానీ, మోదీకి చాలా ఏళ్లుగా స్నేహబంధం ఉంది. గుజరాత్‌ సీఎంగా మోదీ (Modi) ఉన్నప్పటి నుంచే వారి మధ్య విడదీయరాని సంబంధాలున్నాయి. అదానీ డొల్ల కంపెనీల్లో రూ.20వేల కోట్లు పెట్టుబడి పెట్టిందెవరు? అందులో కొన్ని రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయి. వాటిపై రక్షణ శాఖ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. అత్యంత అవినీతి వ్యక్తికి ప్రధాని ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు. దీనికి మోదీ సమాధానం చెపాల్సిందే. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు భాజపా అనర్హత పేరుతో నాటకాలాడుతోంది’’ అని రాహుల్‌ దుయ్యబట్టారు.

మోదీ కళ్లల్లో భయం చూశా..

‘‘ఈ రోజు దేశమంటే అదానీ.. అదానీ అంటే దేశంలా తయారుచేశారు. అదానీపై నా ప్రసంగాన్ని చూసి మోదీ (Modi) ఆ రోజు భయపడ్డారు. ఆయన కళ్లల్లో ఆ భయాన్ని చూశాను. తర్వాత నేను లోక్‌సభలో మరోసారి ప్రసంగిస్తే ఇంకెన్ని నిజాలు బయటపెడుతానేమో అని ఆందోళన చెందారు. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారు. ఓబీసీ అని, దేశ వ్యతిరేకి అంటూ అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలకు వ్యవస్థల మద్దతు లేదని రాహుల్‌ అన్నారు. కేవలం ప్రజల మద్దతుతోనే విపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. అనర్హత విషయంలో తనకు అండగా నిలిచిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యల కేసులో జైలు శిక్ష గురించి విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. న్యాయపరమైన విషయాలు చాలా సున్నితమైనవని, వాటిపై తాను స్పందించాలనుకోవడం లేదంటూ సమాధానం దాటవేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని