Ketaki Chitale: పోలీసులు నన్ను వేధించారు.. కొట్టారు: కేతకి చితాలే

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను షేర్‌ చేసి జైలుపాలైన మరాఠీ నటి కేతకి చితాలే పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.

Published : 02 Jul 2022 02:10 IST

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను షేర్‌ చేసి జైలుపాలైన మరాఠీ నటి కేతకి చితాలే పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో ఉన్న సమయంలో తనను పోలీసులు వేధించారని, భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఛానల్‌తో ఆమె శుక్రవారం మాట్లాడారు.

‘‘ఎటువంటి అరెస్టు వారెంట్‌ లేకుండా పోలీసులు వచ్చి మా ఇంటి నుంచి చట్టవిరుద్ధంగా నన్ను తీసుకెళ్లారు. చట్టవిరుద్ధంగా నాపై ఎటువంటి చర్యలు తీసుకోలేరని నాకు తెలుసు. కానీ, పోలీసు కస్టడీలో ఉన్న నన్ను వేధింపులకు గురిచేసి తీవ్రంగా కొట్టారు. బెయిల్‌ మంజూరు కాగానే చిరునవ్వుతో బయటకు వచ్చాను. ఇంకా దీనిపై పోరాటం కొనసాగుతూనే ఉంది’ అని కేతకి తెలిపారు. తన పోస్ట్‌ ద్వారా ఎవర్నీ అవమానించలేదని చెప్పారు. ప్రజలు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ విధమైన వ్యాఖ్యలు శరద్‌ పవార్‌కి వర్తిస్తాయా?అని ప్రశ్నించారు. వర్తించకపోతే తనపై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. కాగా.. ఇదే ఘటనకు సంబంధించి కేతకిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో 20కిపైగా కేసులు నమోదయ్యాయి. గతంలో ఆమె బెయిల్‌ తిరస్కరణకు గురికాగా.. ఇటీవల జూన్‌ 22న థానే కోర్టు బెయిలు మంజూరు చేయడంతో కేతకి బయటకు వచ్చారు.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పోస్ట్‌ను నటి కేతకి చితాలే ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. ‘మీకోసం నరకం వేచిచూస్తోంది, బ్రాహ్మణులను మీరు అసహ్యించుకుంటారు’ అని ఇందులో రాసి ఉంది. అయితే, దీనిలో శరద్‌ పవార్‌ పేరును ప్రస్తావించకుండా.. ‘80 ఏళ్ల పవార్‌’ అని పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ వయస్సు ప్రస్తుతం 81 ఏళ్లు కావడంతో ఈ పోస్ట్‌ రాజ‌కీయ పార్టీల మ‌ధ్య సంవాదానికి దారితీయ‌వ‌చ్చని పేర్కొంటూ చితాలేపై థానేలోని కల్వా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. దీంతో ఆమెను మే 14న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి కేతకి దాదాపు 40 రోజులపాటు జైలులో గడిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని