Swati Maliwal: నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు.. DCW చీఫ్‌ ఆరోపణలు

తన తండ్రి తనను లైంగికంగా వేధించాడంటూ దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ ఆరోపణలు చేశారు. శనివారం ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.

Published : 11 Mar 2023 18:15 IST

దిల్లీ: బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడం(Sexual Assault)టూ దిల్లీ మహిళా కమిషన్‌(DCW) ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌(Swati Maliwal) తాజాగా ఆరోపణలు చేశారు. డీసీడబ్ల్యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం ఆమె ఈ మేరకు మాట్లాడారు. ‘నా 4వ తరగతి వరకు మేం ఆయనతో కలిసి ఉన్నాం. నన్ను ఆయన అకారణంగా కొట్టేవారు. కొన్నిసార్లు రక్తం వచ్చేది. ఆయన ఇంట్లోకి వస్తే.. చాలా భయమేసేది. ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నా. ఆ సమయంలో.. మహిళల హక్కుల కోసం ఏం చేయాలనేదానిపై ఆలోచించేదాన్ని. ఈ తరహా దుర్మార్గాలకు పాల్పడేవారికి గుణపాఠం చెప్పాలనుకున్నా’ అని స్వాతి మాలివాల్‌ వెల్లడించారు.

‘జీవితంలో దారుణాలను ఎదుర్కొన్నవారు.. ఇతరుల బాధను మరింత అర్థం చేసుకోగలరు. ఈ క్రమంలోనే వ్యవస్థనూ మార్చగలరు. నా విషయంలో ఇదే జరిగింది. ఈ రోజు అవార్డు పొందినవారిలో చాలావరకు మహిళలది దాదాపు ఇదే తరహా పరిస్థితి. తల్లి, పిన్ని ఇతర కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే అప్పటి అకృత్యాల జ్ఞాపకాల నుంచి బయటపడేదాన్నే కాదు’ అని స్వాతి మాలివాల్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ సైతం తన తండ్రిపై ఇటీవల ఇదే తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను గాయపరిచి, చిత్రహింసలకు గురిచేసేవాడని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని