
Nitin Patel: సీఎం పీఠం మిస్.. నితిన్ పటేల్ కంటతడి..!
అహ్మదాబాద్: ముఖ్యమంత్రి పీఠం తనదే అనుకున్న గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు భూపేంద్ర పటేల్ రూపంలో షాక్ తగిలింది. రేసులో ముందు వరుసలో ఉన్నారంటూ ప్రచారం జరిగినా.. మొదటిసారి ఎమ్మేల్యే అయిన భూపేంద్ర వైపు భాజపా అధిష్ఠానం మొగ్గుచూపింది. ఈ పరిణామంతో నితిన్ పటేల్ కలత చెందారంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఒకదశలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు కూడా. అయితే, తనకెటువంటి అసంతృప్తి లేదని, పార్టీ తనకోసం ఎంతో చేసిందని సోమవారం నితిన్ స్పష్టతనిచ్చారు.
ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సోమవారం ఉదయం నితిన్‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో నితిన్ మీడియాతో మాట్లాడారు. ‘భూపేంద్ర పటేల్ మా కుటుంబానికి సన్నిహితుడు. ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆయనకు నా అభినందనలు. అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేయాలని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంపై నేను కలత చెందలేదు. నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి భాజపా కోసం పనిచేస్తున్నాను. నాకు పదవులు దక్కినా, దక్కకపోయినా పార్టీ కోసం నా సేవను కొనసాగిస్తాను’ అని అన్నారు. అయితే, భూపేంద్రను కలిసిన అనంతరం నితిన్ కన్నీటి పర్యంతమైనట్లు కనిపించింది. కానీ, ఆయన మాత్రం ఈ 30 ఏళ్లలో పార్టీ తనకెంతో ఇచ్చిందని, తనకెలాంటి బాధలు లేవని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. కొత్త ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం నితిన్ మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను చూశానన్నారు. తాను ప్రజల హృదయాల్లో ఉన్నానని, తనని ఎవరు తోసిపుచ్చలేరన్నారు.
ఇప్పటి వరకు సీఎంగా ఉన్న విజయ్ రూపాణీ శనివారం గవర్నర్‌కు రాజీనామా లేఖ అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాజపాను విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు చేపట్టింది. సీఎం పీఠాన్ని పటేల్ సామాజిక వర్గానికి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించడంతో ప్రఫుల్ పటేల్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నితిన్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూపేంద్ర పటేల్ వైపే పార్టీ మొగ్గు చూపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.