Prabhakaran: పెద్దపులి బతికే ఉందా.. అయితే కలిసొస్తాంలే: కాంగ్రెస్‌ వ్యంగ్యాస్త్రాలు

ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌ (Prabhakaran) బతికే ఉంటే తాను స్వయంగా వెళ్లి కలుస్తానని అంటున్నారు కాంగ్రెస్‌ తమిళనాడు యూనిట్‌ అధ్యక్షుడు కేఎల్‌ అళగిరి. తమ పార్టీ మాజీ నేత చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చారు.

Published : 14 Feb 2023 01:14 IST

చెన్నై: ఎల్‌టీటీఈ (LTTE) చీఫ్‌ ప్రభాకరన్‌ (Prabhakaran) బతికే ఉన్నారంటూ కాంగ్రెస్‌ మాజీ నేత పాళ నెడుమారన్‌ (Pazha Nedumaran) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తమిళనాడు కాంగ్రెస్‌ (Congress) చీఫ్‌ కేఎల్‌ అళగిరి (KS Alagiri) స్పందిస్తూ.. నెడుమారన్‌పై విమర్శలు చేశారు. ఆయన బతికే ఉంటే.. తాను వెళ్లి కలిసి వస్తానంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ ప్రభాకరన్‌ను చూపిస్తే గనుక నేను స్వయంగా వెళ్లి ఆయనను కలిసి వస్తాను. అందులో సమస్యేం లేదు’’ అని అళగిరి మీడియాతో వ్యాఖ్యానిస్తూ తమ పార్టీ మాజీ నేత నెడుమారన్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

ప్రభాకరన్‌ (Prabhakaran) సజీవంగానే ఉన్నారని, ఆయన త్వరలోనే బయటకు వస్తారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్‌ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమిళ ఈలం (Tamil Eelam) ప్రజల కోసం ఆయన త్వరలోనే తన ప్రణాళికలను వెల్లడిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకరన్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

శ్రీలంక తమిళుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వేలుపిళ్లై ప్రభాకరన్‌ 1970ల్లో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ LTTE) అనే సంస్థను స్థాపించాడు. ఈ పోరాటంలో భాగంగా ఈ సంస్థ శ్రీలంకలో పోలీసులు, మిలిటరీ దళాలపై అనేక దాడులు చేసింది. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యలోనూ ఈ సంస్థ హస్తం ఉంది. ఈ క్రమంలోనే ఎల్‌టీటీఈ (LTTE)పై కఠిన చర్యలు చేపట్టిన శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం.. అధినేత ప్రభాకరన్‌ను హతమార్చినట్లు 2009లో ప్రకటించింది. అతడిని పెద్దపులిగా పిలిచేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని