Bihar: మీ కాళ్లు మొక్కుతా.. పనులు చేయండి

బిహార్‌లో బుధవారం ఓ రోడ్డు ప్రాజెక్టు కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Published : 11 Jul 2024 03:56 IST

రోడ్డు ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధితో నీతీశ్‌  

పట్నా: బిహార్‌లో బుధవారం ఓ రోడ్డు ప్రాజెక్టు కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ పనులు వేగవంతం చేయాలని ప్రైవేటు కంపెనీ ప్రతినిధికి ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (73) విజ్ఞప్తి చేశారు. ‘‘దీని కోసం మీ కాళ్లు మొక్కమన్నా మొక్కుతా’’ అంటూ సీఎం ముందుకు వెళ్లడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ ఛౌదరీ, విజయ్‌కుమార్‌ సిన్హా కూడా అదే వేదికపై ఉన్నారు. ‘జేపీ గంగా పథ్‌’ ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గయా ఘాట్‌ నుంచి కంగన్‌ ఘాట్‌ వరకు రోడ్డునిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మూడోదశ పనులను నీతీశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలు, పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. వాటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నీతీశ్‌.. ఏడాది చివరిలోగా పనులు పూర్తిచేయాలని నిర్మాణసంస్థను ఆదేశించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న నిర్మాణసంస్థ ప్రతినిధిని ఉద్దేశించి.. పాదాలకు నమస్కరిస్తానని సీఎం అన్నారు. ఉన్నపళంగా ముందుకు వెళ్లి అతడి చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కంగుతిన్న ఆ ప్రైవేటు సంస్థ ప్రతినిధి.. ‘సర్‌! అలా చేయకండి’ అంటూ వెనక్కి జరిగారు. వేదికపై ఉన్నవారంతా  సీఎంను నిలువరించే ప్రయత్నం చేశారు. వారం రోజుల కిందట ఓ ఐఏఎస్‌ ఉన్నతాధికారితోనూ నీతీశ్‌ ఇలాగే చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని