Rahul Gandhi: అప్పటిదాకా స్వెట్టర్‌ వేసుకోను: రాహుల్‌ గాంధీ

చిరిగిన దుస్తుల్లో చలికి వణుకుతున్న ముగ్గురు పేద బాలికలను చూశాకే.. ఈ యాత్ర (Bharat Jodo Yatra) లో టీషర్టు మాత్రమే ధరించాలని తాను నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు.

Updated : 10 Jan 2023 11:46 IST

చండీగఢ్‌: ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’ ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi ) ధరించిన టీషర్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక, ఉత్తరాదిన చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన స్వెట్టర్‌ వేసుకోకుండా కేవలం టీషర్టుపైనే యాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై తాజాగా రాహుల్ స్పందించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ పాదయాత్రలో టీషర్టు (T-shirt) మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. చిరిగిన దుస్తుల్లో చలితో వణికిపోతున్న ముగ్గురు బాలికలను చూసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.

హరియాణా (Haryana)లోని అంబాలాలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీషర్టు’ వార్తలపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ స్పందించారు. ‘‘మీరు ఎందుకు టీషర్టు మాత్రమే ధరిస్తున్నారు? మీకు చలిగా అన్పించట్లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి కారణం చెబుతా. యాత్ర ప్రారంభించినప్పుడు కేరళలో చాలా వేడిగా ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టాక కాస్త చలిగా అనిపించింది. అయితే ఆ రాష్ట్రంలో యాత్ర జరుగుతున్నప్పుడు ఓ రోజు ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తుల్లో నా దగ్గరకు వచ్చారు. సరైన దుస్తులు లేక చలికి వణికిపోతున్నారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. శీతల వాతావరణం నన్ను గజగజ వణికించేలా చేసినప్పుడు స్వెట్టర్‌ గురించి ఆలోచిస్తా. అప్పటిదాకా కేవలం టీషర్టుతోనే యాత్ర కొనసాగిస్తా. ఆ బాలికలు చలికి వణికిపోతుంటే.. రాహుల్‌ గాంధీ కూడా వణుకుతాడని వారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నా’’ అని రాహుల్ (Rahul Gandhi) వివరించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ కార్యకర్తలపైనా ఆయన విమర్శలు చేశారు. వారంతా 21వ శతాబ్దపు కౌరవులంటూ మండిపడ్డారు.

జోడో యాత్ర (Jodo Yatra) మొదలైన తర్వాత రాహుల్‌ టీషర్టు ధరపై వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆయన టీషర్టుపై అనేక కథనాలు వచ్చాయి. దీనిపై ఇటీవల ఆయన స్పందిస్తూ.. ‘‘మీడియా నేను ఎలా ఉన్నదానిపై మాత్రమే దృష్టిపెట్టింది. కానీ, నాతో పాటు ఈ యాత్రలో చాలా మంది పేదవాళ్లు, కూలీలు చిరిగిన దుస్తుల్లోనే నడుస్తున్నారు. వాళ్లను ఎందుకు గుర్తించట్లేదు. నేను టీషర్టులో ఉండటం ఇక్కడ సమస్య కాదు. రైతులు, పేద కూలీలు.. వారి పిల్లలు చిరిగిన దుస్తులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందనేదే అసలైన ప్రశ్న’’ అని రాహుల్‌ (Rahul Gandhi) కేంద్రాన్ని దుయ్యబట్టారు.

ప్రస్తుతం జోడో యాత్ర హరియాణాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ యాత్ర జరిగింది. జనవరి 30న కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని