IAF: వాయుసేనకు తీవ్ర నష్టం.. ఒకేసారి కూలిన మిరాజ్‌, సుఖోయ్‌ యుద్ధ విమానాలు

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు ఒకేసారి కుప్పకూలాయి. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2023 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత వాయుసేన (IAF)కు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి.  మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్‌ జెట్లు కూలిపోయినట్టు సమాచారం. యుద్ధవిమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో ఓ వింగ్‌ కమాండర్‌ ప్రాణాలు కోల్పోయారు. 

రోజువారీ శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరిన సుఖోయ్‌-30 (Sukhoi-30), మిరాజ్‌ 2000 (Mirage) విమానాలు కాసేపటికే మొరెనా ప్రాంతంలో కూలిపోయినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. మొరెనా ప్రాంతంలో విమాన శకలాలు పడినట్లు సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్‌లో ఒక పైలట్‌ ఉన్నట్లు వాయుసేన అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో పైలట్‌ తీవ్ర గాయాలతో మృతిచెందినట్లు వాయుసేన ట్విటర్‌లో వెల్లడించింది. మృతుడిని వింగ్‌ కమాండర్‌ హనుమంతరావు సారథిగా గుర్తించినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. గాయపడిన ఇద్దరు పైలట్లను ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై భారత వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. గాల్లో విమానాలు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా? అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఘటనపై వాయుసేన చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌ ఛౌదరీ.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు నివేదించారు. పైలట్ల పరిస్థితి గురించి కేంద్రమంత్రి ఆరా తీశారు. అటు చీఫ్‌ ఆఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహన్‌ కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

అటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ విమాన శకలాలు నేలరాలాయి. తొలుత ఇది ఛార్టర్డ్‌ విమానం అని వార్తలు రాగా.. తర్వాత అది వాయుసేనకు చెందిన యుద్ధ విమానంగా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ కూడా సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ విమాన శకలాలు మధ్యప్రదేశ్‌ నుంచి బయల్దేరి ప్రమాదానికి గురైన విమానాల్లో ఒక దానివి అయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఈ విమాన శకలాలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌పూర్‌లో పడి ఉంటాయని అధికారులు చెప్పినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని